సాధారణంగా కేంద్రంలోగానీ, రాష్ట్రాలలోనూ ప్రధాని, ముఖ్యమంత్రుల తర్వాత హోంశాఖ మంత్రులు నెంబర్ టూగా వ్యవహరిస్తూ ఉంటారు. అయితే చట్టపరంగా ఏ పదవిలేని ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేష్ మాత్రం ఇప్పుడు రాష్ట్రంలో నెంబర్‌టూగానే ఉన్నాడనే వాదన గట్టిగా వినిపిస్తోంది. దీనిని పార్టీలోని ప్రతిఒక్కరు ఒప్పుకుంటున్నారు. మంత్రివర్గంలోకి లోకేష్‌ను తీసుకోకపోయినా ఆయన హవా మాత్రం కొనసాగుతోంది. అన్ని మంత్రిత్వ శాఖల నిర్ణయాలు, పార్టీ నిర్వహణ, చివరకు చంద్రబాబు తీసుకునే పలు నిర్ణయాలను కూడా లోకేషే సమీక్షిస్తుండటం విశేషం. కొన్నిసార్లు కొన్ని విషయాల్లో ఆయన తన తండ్రి చంద్రబాబుకు కూడా కీలకమైన సలహాలు ఇస్తున్నాడట. సాధారణంగా అన్ని పార్టీల్లో కొందరు కింగ్ మేకర్లు ఉంటారు. వైఎస్ హయాంలో కెవిపి రామచంద్రరావులాగా, కాంగ్రెస్ పార్టీలోని సోనియాగాంధీ లా.. కింగ్ మేకర్లు అందరినీ శాసిస్తుంటారు. ఇప్పుడు అదే పని లోకేష్ చేస్తున్నాడని, దానిలో తప్పేముందని ఆయన అనుచరగణం వాదిస్తున్నారు. అయినా అంత కీలక నిర్ణయాలు తీసుకోవాలనుకుంటే కేసీఆర్‌లా ధైర్యంగా తన కుమారుడిని మంత్రివర్గంలోకి తీసుకుంటే ఏ ఇబ్బంది ఉండదు కదా...! అని కొందరు టిడిపి నాయకులు చంద్రబాబుకు సైతం సూచించారని తెలుస్తోంది. మొత్తానికి ఇప్పుడు ఏపీలోని మంత్రులు, చివరకు ఉప ముఖ్యమంత్రులు కూడా లోకేష్ చేతిలోని కీలుబొమ్మలే అన్న సంగతి బహిరంగ రహస్యమే.