విదేశీ వ్యవహారాలు అనేది కేంద్రం పరిధిలోని అంశం. ఇది కేంద్ర జాబితాలో ఉండే విషయం. అయితే తెలంగాణలోని టిఆర్‌ఎస్ మాత్రం రాష్ట్ర మంత్రివర్గంలో కూడా విదేశీవ్యవహారాలను చేరిస్తే ఎలా ఉంటుందా? అనే ఆలోచన చేస్తోంది. అయితే దీనికి రాజ్యాంగ సవరణలు, రాష్ట్రపతి ఆమోదం, పార్లమెంట్‌లో బిల్లులు అవసరమని న్యాయనిపుణులు అంటున్నారు. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం రాష్ట్రంలో కూడా విదేశీవ్యవహారాల మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి ఆ భాధ్యతలను తన కుమారుడు కేటీఆర్‌కు అప్పగించాలని ఆరాటపడుతున్నాడు. ఇప్పటికే తెలంగాణలో పలు కీలక శాఖలను కేటీఆర్ నిర్వహిస్తున్నాడు. విదేశాలకు వెళ్లి అక్కడి నుండి రాష్ట్రానికి ప్రాజెక్ట్‌లు, పెట్టుబడులు వచ్చేలా ఆయన ఇప్పటికే పలు దేశాలు చుట్టివస్తున్నాడు. మరి కొత్తగా ఆయనకు విదేశీవ్యవహారాల శాఖ ఇవ్వాల్సిన అవసరం ఏముందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వంలో నెంబర్ టూ స్దానాన్ని ఎప్పుడో కైవసం చేసుకున్న కేటీఆర్‌కు విదేశీవ్యవహారాల శాఖ లభిస్తే ఇక ఆయనకు తిరుగే ఉండదని అంటున్నారు. దేశ చరిత్రలోనే రాష్ట్ర స్దాయిలో విదేశీ వ్యవహారాల శాఖను దక్కించుకున్న మొదటి వ్యక్తిగా కేటీఆర్ చరిత్ర సృష్టిస్తాడు. అయినా దీనికి పలు సాంకేతిక సమస్యలు ఉన్నాయనే వాదన బలంగా వినిపిస్తోంది.