అకస్మాత్తుగా చిరంజీవి, పూరి జగన్నాథ్ సినిమా తెరపైకి వచ్చింది. ఒకవైపు వినాయక్ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్నారు. దీనికోసం కేవలం కొద్ది రోజుల షూటింగ్ మాత్రమే జరిగింది. హీరోయిన్ కన్ ఫర్మ్ కాలేదు, ఇతర ఆర్టిస్టులెవరనే దానిపై స్పష్టత లేదు. మిగతా షెడ్యూల్ వివరాలు తేలలేదు. అంటే కొంత గందరగోళం ఉందన్నమాట. ఇలాంటి టైమ్ లో పూరి సినిమా నిర్ణయమైందంటూ మీడియాకు లీకేజ్ లు వదిలారు. అయితే దీని వెనుక పెద్ద మతలబు ఉందనే మాట వినిపిస్తోంది.
పూరి జగన్నాథ్ అనేక సంవత్సరాలుగా చిరంజీవిని డైరెక్ట్ చేయాలని ప్రయత్నిస్తున్నారు. గతంలో అనేక దఫాలుగా అవకాశం వచ్చి చేజారింది. ఈ లోపు చిరంజీవి రాజకీయ రైలు ఎక్కేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు తిరిగివచ్చాక 150వ సినిమాకు పూరికే అవకాశం దక్కుతుందని భావించారు. కానీ సమీకరణలు మారి వినాయక్ డైరెక్టర్ అయ్యాడు.
ఇప్పుడు అంటే నిర్మాణంలో ఉన్న 150వ సినిమాపై అనేక వదంతులు వినిపిస్తున్నాయి. చిరంజీవి కథ విషయంలో పునరాలోచనలో పడ్డారని అంటున్నారు. అరువు కథతో సినిమా చేయడం సబబు కాదని భావిస్తున్నట్టు సమాచారం. దీంతో కొత్తకథ కోసం అన్వేషణలో ఉన్నారని, అందుకే పూరికి కబురు వెళ్ళిందనే మాట వినిపిస్తోంది.
నందమూరి బాలకృష్ణ తన వందవ సినిమాగా చారిత్రక నేపథ్యం ఉన్న 'గౌతమిపుత్ర శాతకర్ణి' ఎంపికచేసుకుని ఆదర్శంగా నిలిచారు. ఓపనింగ్ కు వచ్చిన చిరంజీవి ఈ కథని పొగిడేశారు.తన వరకు వచ్చేసరికి మాత్రం తమిళ 'కత్తి' కథతో చేస్తున్నారు. ఇది సరైన నిర్ణయంగా కాదని అభిమానులు సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలో 'కత్తి' కథని పక్కన పెట్టేసి మరో కథతో సినిమా చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన చిరుకు, ఆయన సన్నిహితులకు కలిగినట్టు తెలిసింది. ఇది ఒక ఆలోచన మాత్రమే. ఇందులో భాగంగానే పూరి చెప్పిన పాత కథకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. 150వ సినిమా కథ మారడం లేదా ఆ వెంటనే పూరి కథతో 151వ సినిమా ప్రారంభించడం ఏదో ఒక మార్పు తప్పదని చిత్ర యూనిట్ వర్గాలు అంటున్నాయి.