ఒక సినిమా పాటలు రిలీజ్ చేయాలంటే ఏదో ఒక చోట వేడుక నిర్వహిస్తారు. అతిథులను పిలుస్తారు ఆవిష్కరింపజేస్తారు. కానీ దీనికి విరుద్దంగా కొత్తదనం పేరుతో అల్లరి నరేష్ తాజా చిత్రం 'సెల్ఫీరాజా' యూనిట్ ఊరు వాడ తిరుగుతూ ఒక్కోపాటని రిలీజ్ చేస్తూ హడావుడి చేసింది. దీనివల్ల వచ్చే మైలేజ్ ఎంత..
హిట్ సినిమా కోసం నరేష్ చాలా రోజులుగా ఎదురుచూస్తున్నాడు. 'సుడిగాడు' (2012) తర్వాత నరేష్ నటించిన తొమ్మిది చిత్రాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. అంటే ప్రేక్షకులు దాదాపుగా మర్చిపోయారన్నమాట. అందుకే 'నేనున్నానంటూ..' గుర్తు చేయడం కోసమే టూర్లకు వెళ్ళాడని పరిశ్రమలో జోక్ చేస్తున్నారు. 'సెల్ఫీ రాజా' సినిమాపై నరేష్ ఎంతో నమ్మకం పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. నేడున్న కాంపిటేషన్ లో హీరోలు వెనుకబడితే కోలుకోవడం కష్టం. దీనికి నిదర్శనంగా ఎందరో ఉన్నారు. వారితో పోలిస్తే నరేష్ కొంత బెటర్. ఎందుకంటే ఆయనది కామెడీ జోనర్. ఇందులోకి రావడానికి ఇతర హీరోలు ఇష్టపడరు.
మరోవైపు సెల్పీల గురించి ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. సెల్ఫీ మోజులో చాలామంది యువత ప్రమాదాల్లో పడుతున్నారని ఆందోళన చెందుతున్నారు. దీనికి చెక్ పెట్టాలని ప్రముఖులు విజ్ఞప్తి చేస్తున్న తరుణంలో నరేష్ సెల్ఫీ గురించే సినిమా చేయడం చర్చకు దారితీసే అవకాశం ఉంది.