తెలంగాణలో ప్రతిపక్ష పార్టీలకు వాయిస్ లేకుండా చేసి ఓ నియంతలా కుటుంబ పాలన నడుపుతోన్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు ఇటీవలి కాలంలో టీజేఏసీ చైర్మన్ కోదండరాం నుండి అనుకోని ఇబ్బందులు ఎదురవుతున్న సంగతి తెలిసిందే. దానికి విరుగుడు ఏమిటా? అని ఆలోచిస్తున్న సీఎం కేసీఆర్ చివరకు ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కోదండరాం చేసే విమర్శలకు తాము కూడా స్పందిస్తే ప్రజల్లో కోదండరాంకు క్రేజ్ పెరుగుతుందని భావిస్తోన్న కేసీఆర్.. కోదండరాం ఏ విమర్శలు చేసినా దానికి స్పందించకుండా మౌనంగా ఉండి ఆయనకు పెద్ద ప్రాధాన్యత ఇవ్వకూడదనే నిర్ణయానికి వచ్చాడట. తాము ప్రతి విమర్శలు చేస్తూ పోతే మీడియాలో కూడా కోదండరాం హీరోగా మారుతాడని, అందువల్ల కోదండరాంను పట్టించుకోకుండా ఉండాలనే నిర్ణయం తీసుకున్నాడు. అయితే కేసీఆర్ తీసుకున్న నిర్ణయంలో మంచి చాణక్యం ఉన్నప్పటికీ కొన్నిసార్లు అది ఎదురుతిరిగే ప్రమాదం కూడా ఉంది. కోదండరాం విమర్శలకు సమాధానం చెప్పలేక మౌనంగా ఉంటున్నారనే వాదన బలపడుతుంది. మరోవైపు మౌనం అర్ధాంగీకారం కిందకు కూడా వచ్చే అవకాశం ఉంది. కోదండరాం తాను రాజకీయల్లోకి రానని ప్రకటించినప్పటికీ వచ్చే ఎన్నికల నాటికి ఆయన కేజ్రీవాల్ వలే మారే అవకాశాలు మాత్రం ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.