ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేయించిన సర్వేలో అత్యధికులు టిడిపి ప్రభుత్వం పట్ల అనుకూలంగా ఉన్నారని, కానీ ఎమ్మెల్యేల విషయంలో అధికశాతం జనం అసంతృప్తితో ఉన్నారని తేలిన సంగతి తెలిసిందే. దీంతో సరిగా పనిచేయని ఎమ్మెల్యేల పనితీరు మెరుగుపరచడానికి చంద్రబాబు పార్టీ సీనియర్లతో ఓ కమిటి వేశాడు. కానీ ఇందులో చినబాబుకు కూడా స్దానం కల్పించడం ఇప్పుడు పార్టీ సీనియర్లకు ఇబ్బందిగా మారింది. ఏ పాలనానుభవంలేని లోకేష్.. ఎమ్మెల్యేల పనితీరును ఎలా మెరుగుపరుస్తాడని, ఏ అనుభవం ఉందని ఆయన ఎమ్మెల్యేలకు సలహాలు ఇస్తాడనే విషయంపై టిడిపి సీనియర్లలోనే అసంతృప్తి మొదలైంది. తమను కాదని, అందరూ లోకేష్ మాటలనే వేదవాక్కుగా తీసుకుంటే ఇక కమిటీలో తమకు ఏమాత్రం ప్రాధన్యం ఉండదని, తమ మాటలకు విలువ ఉండదని కమిటీలోని సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. లోకేష్‌ను ప్రమోట్ చేయాలంటే చాలా మార్గాలున్నాయని కానీ ఇలాంటి కమిటీల్లో కూడా లోకేష్‌ను పెడితే మంచి కంటే చెడే ఎక్కువగా జరుగుతుందని సీనియర్లు భావిస్తున్నప్పటికీ ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చే ధైర్యం చేయలేకపోతున్నారని అంతర్గత సమాచారం. మరి ఈ విషయం ఆ నోటా ఈ నోటా బాబు దృష్టికి కూడా వెళ్లిందని, మరి దీనిపై బాబు పార్టీ అంతర్గత సమావేశాల్లో ఎలా స్పందిస్తాడో వేచిచూడాల్సివుంది.....!