చిరంజీవికి మెగాస్టార్ ఇమేజ్ రావడానికి పునాదులు వేసిన వారిలో ఏ.కోదండరామిరెడ్డి (ఏకోరెడ్డి) ఒకరు. అందుకే చిరు కెరీర్ కు సంబంధించి సలహాలు, సూచనలు చేసే అర్హత ఆయనకు ఉంది. తాజాగా వినోదాత్మక చిత్రంలో చిరంజీవి నటిస్తే బావుంటుందని సలహా ఇచ్చారు. దానర్థం కామెడీ సినిమా చేయమని కాదు. ఇది విలువైన సూచన. దీనిపై చిరు వర్గీయులు, అభిమానులు ఆగ్రహించడం సరికాదు.
రజనీకాంత్, చిరంజీవి వీరంతా అమితాబ్ బచ్చన్ ని గౌరవిస్తారు. ఆయన తన స్టార్ డమ్ ను నిలబెట్టుకునే ప్రయత్నంలొ మాస్ సినిమాలు చేశాక, మళ్ళీ ఆ స్థాయి కథలు దొరకడం కష్టమైన నేపథ్యంలో వినోదాన్ని నమ్ముకున్నారు. సత్తేప సత్తా, నమక్ హలాల్ వంటి వినోదాత్మక కథా చిత్రాల్లో నటించి సక్సెస్ అయ్యారు. రజనీకాంత్ చిత్రాల్లో సైతం ప్రథమార్ధం వినోదంగా, ద్వితీయార్థం సీరియస్ గా ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. సంభాషణల్లో మాత్రమే సందేశాలు ఉంటాయి. సరిగ్గా వీటన్నింటిని పరిశీలించే ఏకోరెడ్డి చిరంజీవికి సూచన చేశారని భావించవచ్చు.
మహానటులు ఎన్టీఆర్ యమగోల, అక్కినేని శ్రీరంగనీతులు వంటి హాస్యప్రధానమైన సినిమాల్లో నటించి సక్సెస్ సాధించారు. నటుడు అనేవాడు అన్ని రకాల పాత్రలను చేయాలి. ఈ విషయాలను తెలుసుకునే ఏకోరెడ్డి సలహా ఇచ్చారు.
చిరంజీవి 150వ సినిమా మెుదలైంది. ఇది అరువు తెచ్చుకున్న కథతో తీస్తున్నది. రైతు సమస్యలపై ఇతివృత్తం. అంటే సందేశాలు ఇచ్చే అవకాశం ఉంది. అందుకే చిరంజీవి సందేశాలు ఇస్తే ఎవరూ వినరు అని ఏకోరెడ్డి తేల్చిచెప్పారు.
ఒకప్పుడు చిరంజీవికి ఎంతో సన్నిహితుడైన ఏకోరెడ్డి చెప్పిన విషయాన్ని సీరియస్ గా ఆలోచిస్తే మంచిది.