కుస్తీ వీరుల నేపథ్యంలో ఇప్పటికే బాలీవుడ్ స్టార్స్ అమీర్‌ఖాన్, సల్మాన్‌ఖాన్‌లు తమ సత్తా చాటారు. బాలీవుడ్‌లో ఇటీవల రంజాన్‌కు విడుదలైన 'సుల్తాన్'తో సల్మాన్‌ఖాన్ విమర్శకుల ప్రశంసలు పొందుతున్నాడు. అలాంటి చిత్రం టాలీవుడ్‌లో కూడా వస్తే చూడాలని పలువురు భావిస్తున్నారు. అయితే టాలీవుడ్‌లో కండలవీరుడుగా, ఆజానుబాహునిగా ఉన్న రానా ఇలాంటి చిత్రం చేయడంపై స్పందించాడు. తనకు 'కలియుగ భీమ'గా చేయాలనే కోరిక ఉందని, కుస్తీపోటీలో 'కలియుగ భీమ'గా పేరున్న కోడి రామ్మూర్తినాయుడు జీవిత చరిత్ర ఆధారంగా తీస్తే అందులో నటించాలని ఉందని రానా తెలిపాడు. విజయనగరంకు చెందిన కోడి రామ్మూర్తి నాయుడు చరిత్రను ఎవరైనా తీయదలుచుకుంటే మాత్రం అందులో తన సత్తా చాటి చూపించాలని రానా ఆశిస్తుండటం విశేషం. మరి ఇలాంటి చిత్రం చేయడానికి ఎవరైనా దర్శకనిర్మాతలు ముందుకు వస్తారా? అనేది ఆసక్తిని కలిగించే విషయం.