రాజకీయాలలో ఓర్పే కాదు.. నేర్పు కూడా చాలా ముఖ్యం. పొరపాట్లు, తప్పులు చేయడం మానవనైజమే అయినా వాటిని తెలుసుకొని వెంటనే సరిదిద్దుకోవడం నాయకుల లక్షణం. ఇలాంటి లౌక్యం, చాణక్యం తెలుసుకాబట్టే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా నిలదొక్కుకోగలుగుతున్నాడు. విజయవాడ దేవాలయాల కూల్చివేత వ్యవహారంలో చంద్రబాబు లౌక్యంగా వ్యవహరించకపోయివుండుంటే ఇప్పటికే విజయవాడ కేంద్రంగా రాష్ట్రంలో కుల ఘర్షణ (కాపు, కమ్మ) మొదలై ఉండేది. విజయవాడలో జరిగిన దేవాలయాల విధ్వంసం అంతా చంద్రబాబు డైరెక్షన్‌లోనే జరిగి ఉంటుందనేది అక్షర సత్యం. ఆయన భరోసా లేకుంటే ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, కలెక్టర్ అహ్మద్‌బాబు, కమిషనర్ వీరపాండియన్‌లు ఇంత ఓవరాక్షన్ చేయలేరు. హిందువులు గౌరవించే స్వామీజీలపై కేశినేని నాని అంత విమర్శలకు దిగలేడు. బాబు ఉన్నాడులే అనే దైర్యంతోనే వాళ్లు ఇంత వీరంగం సృష్టించారు. దేవాలయాల విధ్వంసానికి వ్యతిరేకంగా బిజెపి, హిందు సంస్దలు ఆందోళనకు దిగినా పెద్ద ప్రభావం చూపలేదు. అయితే బిజెపి తరపున కాపు నేతలు రంగంలోకి దిగడం వారితో కేశినేని నాని, బుద్దా వెంకన్నలు గొడవకు దిగడం కథను మలుపు తిప్పింది. బిజెపీ రాష్ట్ర మంత్రులనే లెక్కచేయని చంద్రబాబు, ఆ పార్టీ ఆందోళనలను అసలు పట్టించుకొని ఉండేవాడు కాదు. కానీ బిజెపి, హిందు సంస్థల తరపున కాపు నాయకులు ముందు నిలబడడం చంద్రబాబుకు కొత్త తలనొప్పి తెచ్చింది. అసలే గుడులను కూల్చడం సెంటిమెంట్ సమస్య. దానికి కులం తోడయింది. విజయవాడలో కాపు నాయకులకు, కమ్మ నాయకులకు మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. అది ముదిరితే క్షణాల్లో కాపు, కమ్మల ఘర్షణ రాష్ట్రమంతా పాకే అవకాశముంది. అసలే కాపు రిజర్వేషన్ల విషయంలో ముద్రగడ పద్మనాభం చేస్తున్న ఆందోళనతో చంద్రబాబుకు నిద్ర పట్టడం లేదు. కాపుల్లో చంద్రబాబు పట్ల వ్యతిరేకత మొదలైంది. అవకాశం చిక్కినప్పుడల్లా ప్రతిపక్ష వైకాపా కూడా ఈ రెండు కులాల మధ్య ఎడబాటుకు తనవంతు సహకారం అందిస్తూనే ఉంది. దాదాపు 27 ఏళ్ల క్రితం హత్యకు గురైన వంగవీటి రంగా వర్ధంతిని ఇంతకు ముందెన్నడూ లేని విధంగా ఈ ఏడాది ఘనంగా జరిపారు. ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వమే రంగాను హత్య చేసిందనే విషయాన్ని మళ్లీ కాపులందరికీ గుర్తు చేసే ప్రయత్నం జరిగింది. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం కాపుల మద్దతుతోనే అధికారంలోకి వచ్చింది. మారిన పరిస్థితుల్లో టిడిపికి కాపుల మద్దతు తగ్గిందనే చెప్పొచ్చు. అది ఇంకా ముదిరితే రాజకీయంగా చాలా నష్టమని భావించిన చంద్రబాబు విజయవాడ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించి చేసిన పొరపాటును కొంత వరకు సరిదిద్దుకున్నాడు. దేవాలయాల కూల్చివేతపై కమిటీ వేసి అందులో ఇద్దరు బిజెపి మంత్రులను చేర్చడమే కాకుండా దేవాలయాల పున: నిర్మాణానికి హామీ ఇచ్చారు. బిజెపి వైపు ముందుండి నడిచిన కాపు నేతలను శాంతింపజేసి తన పార్టీపరంగా నష్ట నివారణ చర్యలు తీసుకున్నాడు.