ఆటల్లో ఒకరి వైఫల్యాలు ఇంకొక్కరి విజయానికి సోపానాలు. ఆటయినా రాజకీయమైనా అవతలి వారి వైఫల్యాలను అందిపుచ్చుకుని మన విజయాలుగా మలచుకోవాలి. దీనికి శక్తే కాదు.. యుక్తి కూడా ముఖ్యమే..! వైఫల్యాలు పాఠాలు కావాలి. అనుభవాలు గుణపాఠం నేర్పాలి. 2014 ఎన్నికల్లో జరిగిన పరాభవాల అనుభవాల నుండి వైసీపీ ఇంకా గుణపాఠం నేర్చుకున్నట్లు లేదు. అదే నిరిప్తధోరణితో ఉంది. ఇప్పుడు రాష్ట్రంలో వైయస్ సానుభూతి లేదు. జగన్ గాలి అంతకన్నా లేదు. రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బతికి బట్టకట్టడం ఒక్క చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాల మీదనే ఆధారపడి ఉంది. ప్రభుత్వ వైఫల్యాలను అందిపుచ్చుకుని సద్వినియోగం చేసుకోవడంలోనే ప్రతిపక్షం మనుగడ ఆధారపడి ఉంటుంది. విజయవాడలో ఇటువంటి అవకాశమే వైకాపాకు వచ్చినా, దానిని రాజకీయ ప్రయోజనాస్త్రంగా మలచుకోవడంలో ఆ పార్టీ పూర్తిగా విఫలమైంది. కృష్ణా నదికి 12ఏళ్లకోసారి పుష్కరాలు వస్తాయి. ఈ పుష్కరాల కోసమని ఎన్నోఏళ్లుగా విజయవాడలో ఉన్న 45 పురాతన దేవాలయాలను అధికారులు కూలగొట్టారు. ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సారధ్యంలో గుళ్లు నేలమట్టం అయ్యాయి. సాధారణంగా గుళ్లను తొలగించేందుకు ఒకే ఆచారం, పద్దతి ఉంటుంది. ఈ ఆచారాలేవీ పాటించకుండా కాలువ కట్టల మీద గుడిసెలు తొలగించినట్లుగా గుడులను తొలగించారు. దేవతామూర్తుల విగ్రహాలను ట్రాక్టర్లలో వేయడం, రోడ్డు మీద పడవేయటం టీవీలలో పత్రికల్లో ఈ దృశ్యాలు చూసి హిందువులు భగ్గుమన్నారు. బిజెపి, ఇద్దరు మంత్రులు ఈ గుడుల కూల్చివేతకు అడ్డంగా నిలిచారు. పార్టీ రాష్ట్ర నాయకులు రంగంలోకి దిగి ఇదేమని నిలదీసే సరికి గాని ప్రభుత్వం, మంత్రులు దారికి రాలేదు. అయితే ఈ మొత్తం ఎపిసోడ్‌లో వైఫల్యం చెందింది వైకాపానే. గుళ్ల కూల్చివేతకు వ్యతిరేకంగా బిజెపి నాయకులు, సాధువులు, విహెచ్‌పి కార్యకర్తలు ఆందోళనకు దిగారు గాని ప్రతిపక్షంగా వైకాపా నాయకులు ఈ దుశ్చర్యను ఖండిస్తూ విజయవాడ రోడ్ల మీదకు రాలేదు. పద్దతి. పాడు లేకుండా దేవాలయాల కూల్చివేతపై ప్రతిపక్ష వైకాపీ పెద్ద ఎత్తునే ఆందోళన చేసి ఉండవచ్చు. ముందుగా ప్రతిపక్ష నేత జగనే అక్కడ దిగాలి. పరిస్దితులను పరిశీలించి ఉండాలి. వీళ్లు ఆ పని చేసి ఉంటే వైకాపా మీదున్న క్రిస్టియన్ ముద్ర కొంత పోయి హిందువులలో వైకాపాకు పూర్తి దూరంగా ఉన్న కొన్ని వర్గాలు దగ్గరయ్యే అవకాశం ఉండేది. చంద్రబాబు చేజేతులా ఇచ్చిన అవకాశాన్ని జగన్ చేజేతులా జారవిడిచాడు.