ఒకప్పుడు మన తెలుగు స్టార్స్ కేవలం టాలీవుడ్‌కే పరిమితం అయ్యేవారు. కానీ పరభాషా హీరోలు తెలుగుపైనే కాకుండా మిగిలిన భాషా మార్కెట్లపై కన్నేయడంతో మన హీరోలకు కూడా జ్ఞానోదయం కలిగింది. ఇక తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ భాషల్లో కూడా విడుదలై 'బాహుబలి' చిత్రం రికార్డులు సృష్టించడంతో మన హీరోలు కూడా ఇప్పుడు పరభాషా మార్కెట్లపై కన్నేశారు. అందులో భాగంగా మహేష్‌బాబు, ప్రభాస్, అల్లుఅర్జున్, ఎన్టీఆర్, రామ్‌చరణ్, నాని, శర్వానంద్... ఇలా ఈ హీరోలందరూ ఇప్పుడు మిగతా భాషలపై కన్నేశారు. పవన్ సర్దార్ ప్రయత్నం బెడిసి కొట్టినా..ఇతర హీరోలకు అది స్ఫూర్తినిచ్చింది. ఇప్పటికే మహేష్‌కు తెలుగుతో పాటు కన్నడలో మంచి మార్కెట్ ఉంది. దీన్ని విస్తరిస్తూ తన చిత్రాలకు తమిళ, బాలీవుడ్‌లలో కూడా మార్కెట్ పెంచుకునే ప్రయత్నంలో భాగంగా మురుగదాస్ చిత్రాన్ని తమిళ, హిందీ భాషలలో కూడా రిలీజ్ చేయనున్నాడు. ఇక అల్లుఅర్జున్‌కు ఇప్పటికే మలయాళంలో పెద్ద మార్కెట్ ఉంది. దాంతో ఆయన కూడా ప్రస్తుతం తమిళంపై కన్నేశాడు. ఎన్టీఆర్ తన తాజా చిత్రం 'జనతాగ్యారేజ్' ద్వారా మలయాళ మార్కెట్‌పై దృష్టి సారించాడు. ఇటీవల ఈ చిత్రం టీజర్ తెలుగులో ఎన్టీఆర్ ప్రధానంగా విడుదల చేయగా, మలయాళంలో మోహన్‌లాల్‌ను హైలైట్ చేస్తూ మరో ప్రత్యేక టీజర్‌ను విడుదల చేశారు. రామ్‌చరణ్ 'జంజీర్'తో బాలీవుడ్‌లో పరిచయమైనా ఇప్పుడు మాత్రం ఆయన కన్ను కేవలం మలయాళ, తమిళ భాషలపైనే ఉంది. ఇక 'బాహుబలి' తో ప్రభాస్ నేషనల్ స్టార్ అయిపోయాడు. 'బాహుబలి 2' తర్వాత కూడా ఆయన నటించే చిత్రాలను నేషనల్ వైడ్‌గా విడుదల కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక నాని, శర్వానంద్‌లతో మరికొందరు కుర్రహీరోలు కూడా ఇతర భాషల్లో కూడా ఆదరణ పొందడం శుభపరిణామంగా చెప్పుకోవాలి.