రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా, హోంశాఖను కూడా నిర్వహిస్తున్న చిన్నరాజప్ప పనితీరుపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన వాడిగా ఆయనకు ఉపముఖ్యమంత్రితో పాటు హోంశాఖను ఇచ్చినప్పటికీ ఆయన పనితీరు బాబుకు నచ్చడం లేదని సమాచారం. ముద్రగడ ఉద్యమ సమయంలో కూడా కఠినంగా వ్యవహరించకుండా కేవలం ప్రకటనలు, ఉపన్యాసాలతో ఆయన కాలం గడిపాడని, అంతేకానీ కాపులను తమకు అనుకూలంగా ఉండేలా చేసి, టిడిపి ప్రభుత్వం కాపులకు ఇస్తున్న ప్రాధాన్యతను ఆయన ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లలేకపోయాడనే విమర్శ ఉంది. అలాగే ఆయన సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాడని, అందుకే హోంశాఖకు చెందిన పలు అంశాలపై డిజిపి రాముడునే స్వయంగా సమీక్షించమని బాబు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అలాగే మరో కాపు మంత్రి గంటా శ్రీనివాసరావు పనితీరుపై కూడా బాబు అసహనంగా ఉన్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో చిన్నరాజప్పతో పాటు గంటాకు కూడా పదవి గండం ఉందని తెలుస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబుకు అత్యంత సన్నిహితునిగా ఉన్న అచ్చెన్నాయుడుకు హోంశాఖను ఇచ్చే ఆలోచనలో బాబు ఉన్నాడట. మరి ఈ ఇద్దరికీ ఉద్వాసన పలికితే కాపు సామాజిక వర్గం ఎలా రియాక్ట్? అవుతుందనేది ఆసక్తికరంగా మారింది.