ప్రస్తుతం ఢిల్లీలో టిడిపి ప్రభుత్వ అధికార ప్రతినిధిగా పదవిలో ఉన్న కంభంపాటి రామ్మోహన్‌రావు పదవికాలం ముగిసి ఇప్పటికే నెల రోజులు కావస్తున్నా.. ఆయనను తిరిగి అదే పదవిలో కొనసాగిస్తారా? లేదా? అనే విషయంపై స్పష్టత లేదు. దీంతో కంభంపాటిలో ఆందోళన ఎక్కువైందని అంటున్నారు. రాజ్యసభకు పంపాలని ఆయన బాబును కోరినప్పటికీ అది సాధ్యం కాలేదు. కనీసం సీనియర్ నాయకుడినైన తనను తిరిగి ఢిల్లీలో రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి పదవిలో తననే కొనసాగించాలని ఆశపడుతున్నారు. ఈ పదవిని అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. అయితే గత కొంతకాలంగా ఈ పదవిలో ఒకే సామాజిక వర్గానికి చెందిన నేతలకు ఈ పదవులు ఇవ్వడంతో ఈసారి వేరే సామాజిక వర్గానికి చెందిన వారికి ఆ పదవి దక్కుతుందని పలువురు ఆశావహులు భావిస్తున్నారు. ఢిల్లీలో ముఖ్యనాయకులకు, కేంద్ర ప్రభుత్వానికి చెందిన మంత్రులు నుండి ప్రధాని వరకు అన్ని రాష్ట్ర వ్యవహారాలను చక్కదిద్దడంలో వీరిది కీలకపాత్ర కావడంతో కంభంపాటి కూడా దీనిని ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాడు. మరలా తనను ఢిల్లీ పంపుతారా? లేక ఇంటికి పంపుతారా? అనే విషయంలో చంద్రబాబు మదిలో ఏముందో తెలియక అందరూ ఈ విషయాన్ని ఆసక్తిగా గమనిస్తున్నారు.