ఏపీలోని టిడిపి ప్రభుత్వానికి సంబంధించిన అవినీతిని ఆధారంగా చేసుకొని ప్రముఖ జాతీయ పత్రిక ది టైమ్స్ ఆఫ్ ఇండియాలో ప్రచురించిన ఓ కథనం ఇప్పుడు అన్నిచోట్లా సంచలనం సృష్టిస్తోంది. కృష్ణ పుష్కరాలను సొమ్ము చేసుకొని అవినీతి చేసి తమకు నచ్చిన వారికి కాంట్రాక్టు పనులు ముట్టజెప్పేవిధంగా ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఈ కథనంలో ప్రచురించారు. ఇప్పటికే కృష్ణా పుష్కరాల పనులు ప్రారంభం కావాల్సివుండగా ఏపీ ప్రభుత్వం మాత్రం ఏ పనులు ముందుగా మొదలుపెట్టకుండా ఆలస్యంగా ప్రారంభించి సరైన సమయంలేదనే వంకతో టెండర్ల ప్రక్రియకు మంగళం పాడి నామినేషన్ విధానాన్ని అమలు చేయాలని భావిస్తున్నారట. వాస్తవానికి రూ.5లక్షల లోపు పనులకు మాత్రమే నామినేషన్ ద్వారా కాంట్రాక్ట్‌పనులు ఇచ్చే అవకాశం ఉంది. అంతకు మించిన మొత్తాలకు మాత్రం ఖచ్చితంగా టెండర్ల విధానాన్నే అమలు చేయాలి. కానీ ఏపీ ప్రభుత్వం అలా చేయడం లేదట. ఈ పథకాన్ని రచించి అవినీతిని సొమ్ము చేసుకునేందుకు ముగ్గురు మంత్రులు, ఆరుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ కలిసి ఓ జట్టుగా ఏర్పడి ఈ అవినీతికి పాల్పడుతున్నారని, ఇటీవలే ఆర్ అండ్ బి శాఖలో ఇంజనీర్‌గా పనిచేస్తున్న వ్యక్తి బావమరిదికి కోట్లాది రూపాయల విద్యుత్ కాంట్రాక్ట్‌ను ఇచ్చారని, అందులో లక్షల రూపాయల అవినీతి జరిగిందని టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఇప్పటికే ప్రభుత్వ ఆర్ధిక కష్టాల్లో ఉండి కూడా దాదాపు 1100కోట్లను కృష్ణా పుష్కరాల కోసం కేటాయించిందని, కానీ ఈ మొత్తం కూడా సరిపోవని భావించి మరిన్ని కోట్లు ఈ పుష్కరాలకు కేటాయించడం దారుణమని ఆ పత్రిక తెలిపింది.