అడ్డదిడ్డంగా రాష్ట్రాన్ని విభజించి ఏపీలో గల్లంతయిపోయిన కాంగ్రెస్ నాయకులు టిడిపిపై వ్యతిరేకత పెరిగిందని, దాన్ని వైసీపీ సరిగ్గా క్యాష్ చేసుకోవడం లేదని, కాబట్టి 2019 నాటికి తమ పార్టీ మరలా ఏపీలో పుంజుకుంటుందని పగటి కలలు కంటున్నారు. రాష్ట్రాన్ని విభజించడంలో కాంగ్రెస్ పాత్ర ఏమీ లేదని, అన్నిపార్టీల అంగీకారంతోనే తాము రాష్ట్రాన్ని విభజించామని డిగ్గీరాజా గారు సెలవిస్తున్నారు. కాగా వైయస్ రాజశేఖర్‌రెడ్డికి కాంగ్రెస్‌కు ఏమీ సంబంధం లేదని వైసీపీ చెప్పుకోవడాన్ని దిగ్విజయ్‌తో పాటు మిగిలిన కాంగ్రెస్ నాయకులు మండిపడుతున్నారు. అయినా ఈ నాయకుల మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, రాష్ట్రాన్ని విభజించడంలో అన్ని పార్టీల అంగీకారం ఉన్నప్పటికీ అడ్డగోలుగా విభజించమని ఏ పార్టీ చెప్పలేదనే విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల నాటికి ఏపీతో సహా తెలంగాణలోనూ, కేంద్రంలోనూ తామే గెలుస్తామని కాంగ్రెస్ నాయకులు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారు. విశాఖలో జరిగిన కార్యకర్తల సమావేశంలో డిగ్గీ రాజాతో పాటు రఘువీరారెడ్డి, టి.సుబ్బరామరెడ్డి వంటి వారు పాల్గొని వేదికపైనే కునుకు తీస్తూ ఉండటం మీడియా కంటపడింది. చిత్తశుద్దిలేకుండా మాట్లాడుతూ.. అసలు రాష్ట్ర విభజనలో తమ తప్పేలేదని చెబుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులను ప్రజలు నమ్ముతారా? తెలంగాణలో కనీసం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది అనే సెంటిమెంట్ వచ్చే ఎన్నికల నాటికి వచ్చినా, ఏపీలో మాత్రం మరో దశాబ్దకాలం పాటు కాంగ్రెస్ అడ్రస్ కనిపించే ప్రశ్నే లేదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.