ప్రత్యేకహోదా, ప్రత్యేక రైల్వే జోన్, ఆర్దికప్యాకేజీలు ఏమీ ఇవ్వకుండా కేంద్రంలోని బిజెపి సర్కార్ ఆంధ్ర పై వివక్షను చూపిస్తోందా? అంటే అందరు అవుననే అంటున్నారు. ప్రతి రాష్ట్ర రాజధాని నుండి న్యూఢిల్లీకి రైల్వేశాఖ రాజధాని ఎక్స్‌ప్రెస్‌లను నడుపుతుంది. కానీ అమరావతి నుండి న్యూఢిల్లీకి వెళ్లే విధంగా రైల్వే శాఖ కొత్తగా ప్రయాణ మార్గాన్ని వేయడం ఇప్పుడు కుదిరేపని కాదని తేల్చిచెప్పింది. తాజాగా ఎన్నో ఏళ్లు పోరాడి సాధించుకున్న వైజాగ్- న్యూఢిల్లీ మధ్య నడిచే ఏపీ ఎక్స్‌ప్రెస్‌ను కూడా త్వరలో ఎత్తివేసే ఉద్దేశ్యంతో రైల్వే శాఖ ఉన్నట్లు సమాచారం. ఈ రైలును సరిగ్గా ఏడాది కిందట ఆగష్టు 12న కేంద్రమంత్రి సురేష్‌ప్రభు ప్రారంభించాడు. కానీ ఈ రైలు ఆక్యుపెన్సీ ఆశించిన స్దాయలో లేదు. విమాన టిక్కెట్లను మించిన ధరలు, వేళగాని వేళల్లో నడపడం వల్ల ఈ రైలులో ప్రయాణించడానికి ప్రయాణీకులు ఆసక్తి చూపడం లేదు. దీన్ని సాకుగా చూపించి నష్టాలొస్తున్నాయనే వంకతో ఈ రైలును తీసివేయాలని భావిస్తున్నారు. వాస్తవానికి ఈ రైలు బోగీలు, ఇంజన్‌లు జర్మన్ టెక్నాలజీతో రూపొందాయి. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ఇవి ప్రయాణించగలవు. కానీ రైల్వే శాఖ ఈ రైలును కేవలం 110 కిలోమీటర్ల వేగానికి మాత్రమే అనుమతి ఇచ్చింది. సగటున ఈ వేగం 60 కిలోమీటర్లకు కూడా మించడం లేదు. దీంతో ఈ రైలులో ప్రయాణించే వారు గంటలకు గంటలు సమయం వెచ్చించాల్సిరావడం శాపంగా మారింది. ఈ కారణాల వల్ల ఈ రైలుపై ఎవ్వరు ఇంట్రస్ట్ చూపడం లేదు. వేగం పెంచడం, వేళలు మార్చడం, రేట్లు తగ్గించడం వంటి చర్యలు తీసుకోకుండా ఈ రైలును తీసేయాలని రైల్వేశాఖ ఆలోచిస్తుండటం శాపం కానుంది.