రోజురోజుకు చంద్రబాబు నాయుడుపై విమర్శలు ఎక్కువవుతున్నాయి. దీంతో ఆయన తన సహచర మంత్రులతో కలసి విమర్శలకు సమాధానం ఇచ్చేలా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని భావిస్తున్నాడు. ప్రతిపక్ష వైసీపీ నేటి నుండి గడప గడపకు వైసీపీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీంతో బాబు వైసీపీ వ్యూహానికి ప్రతివ్యూహం రచించే పనిలో బిజీగా ఉన్నాడు. తమ ప్రభుత్వం చేస్తోన్న సంక్షేమపథకాలు, అభివృద్ది, నెరవేరుస్తున్న హామీల గురించి తన సహచర ఎమ్మెల్యేలు, మంత్రులు క్షేత్ర స్దాయిలోని ప్రజలకు చేరవేయడంలో విఫలమవుతున్నారని బాబు అసహనంగా ఉన్నారు. ఇక టిడిపికి మిత్రపక్షమైన బిజెపి సైతం చంద్రబాబుపై రోజుకో అంశంపై మండిపడుతోంది. కృష్ణ పుష్కరాల కోసం విజయవాడలోని పలు గుళ్లను కూలగొట్టడంపై బిజెపి నాయకులు గుర్రుగా ఉన్నారు. ఈ విషయాన్ని కూడా టిడిపి శ్రేణులు ఎదుర్కొలేకపోయి చేతులెత్తేశాయని, విమర్శలు చేస్తున్న వారిపై ఎంత సేపు తాను మాట్లాడటం కాదని, పార్టీలోని అందరూ వీటిపై స్పందించాలని బాబు ఆదేశాలు జారీ చేశారని సమాచారం. ఇక తెలంగాణ మంత్రులు, ఏపీలోని ప్రతిపక్ష వైసీపీ నేతలు చేస్తున్న దుష్పచారాన్ని కట్టడి చేయాలని బాబు పార్టీలోని అందరికి అల్టిమేటం జారీ చేశాడని తెలుస్తోంది.