ఇతర భాషా హీరోలకు ఒక్క హిట్ వస్తే చాలు... ఇక తెలుగులోనే స్ట్రెయిట్ చిత్రాలు చేయాలని ఆరాటపడిపోతూ ప్లానింగ్‌లు వేస్తుంటారు. అలాంటి వారి లిస్ట్‌లో విజయ్ ఆంటోని కూడా చేరనున్నాడు. సంగీత దర్శకునిగా మొదలెట్టి తమిళంలో ప్రస్తుతం మంచి విజయాలే సాధిస్తున్న ఆయన నటించిన 'సలీమ్' చిత్రం చాలాకాలం కిందట రిలీజై ఫర్వాలేదనిపించుకుంది. తాజాగా అతను నటించిన 'బిచ్చగాడు' చిత్రం తన బొచ్చలో 20కోట్లను వేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ చిత్రం 50 రోజులు దాటినా కూడా బాక్సాఫీస్ వద్ద కొన్ని ఏరియాల్లో స్టడీగానే ఉంది. దీంతో తనను ఇంతగా ఆదరించిన తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతూ.. విజయ్‌ఆంటోని త్వరలో ఓ తెలుగు స్ట్రెయిట్ చిత్రం చేయడానికి రెడీ అవుతున్నాడు. అయితే 'సలీమ్', 'బిచ్చగాడు' చిత్రాలు కేవలం కథాబలం వల్లనే బాగా ఆడాయే గానీ విజయ్ ఆంటోనిని చూసి ఆడాయనేది కరెక్ట్ కాదు. ఆయన తెలుగులో చేసినా అందులో కథాబలం ఉంటేనే ఆడుతాయి కానీ అప్పుడే తనకు తెలుగులో స్టార్ స్టేటస్ వచ్చిందని భావించడం సరికాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.