గత కొంతకాలంగా వైసీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత జగన్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడని సమాచారం. ఒకవైపు తన పార్టీ ఎమ్మెల్యేలు అధికార టిడిపిలోకి జంప్ చేస్తుండటంతో పాటు ఆయన అక్రమాస్తుల కేసు విషయంలో వేలాది కోట్ల రూపాయలను ఈడీ అటాచ్ చేయడంతో జగన్ పరిస్ధితి ఆర్ధికంగా, రాజకీయంగా దిగజారిందని సమాచారం. త్వరలో ఆయన గడప గడపకు వైసీపీ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సిద్దం అవుతున్నాడు. కానీ ఐదారు నెలలు ప్లాన్ చేసిన ఈ కార్యక్రమానికి జగన్ తగిన ఆర్ధిక వనరులు సమకూర్చడంలో విఫలమయ్యాడని అంటున్నారు. దాంతో ఈ కార్యక్రమానికి సంబంధించిన స్టేషనరీని మాత్రమే ఆపార్టీ అధిష్టానం ఇస్తుందని, మిగతా ఖర్చులను ఆయా నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లే భరించాలని జగన్ స్పష్టం చేయడంతో జిల్లా స్దాయి నాయకులు, ఎమ్మెల్యేలు తలలు పట్టుకుంటున్నారు. తాము సొంతంగా అంత డబ్బు ఖర్చుపెట్టుకోలేమని, తమకు పార్టీ ఫండ్ నుంచి నిధులు కేటాయించకపోతే తమ పరిస్థితి దారుణంగా తయారవుతుందని, ఇప్పటికే పార్టీ కోసం ఇంత చేసినా వైసీపీ కేవలం ప్రతిపక్షానికి మాత్రమే పరిమితం కావడం వల్ల సంపాదన మార్గాలు లేక ఇబ్బందులు పడుతున్నామని జిల్లా నేతలు జగన్ దృష్టికి తీసుకెళ్లుతున్నారు. ఇక జగన్ తాజాగా రాష్ట్రంలోని నియోజకవర్గాల్లో ఆర్ధికంగా బలంగా ఉన్న వారిని చేరదీసి వారిచేత గడప గడపకు వైసీపీని విజయవంతం చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.