ఒకప్పుడు వాజ్‌పేయ్, అద్వానీలకు అత్యంత సన్నిహితునిగా పేరు తెచ్చుకున్న మాటల మాంత్రికుడు వెంకయ్యనాయుడు. కానీ మోడీ ప్రధాని అయిన తర్వాత వెంటనే ఆయన పక్కన చేరిపోయాడు. అద్వానీ అనుచరగణానికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వని ప్రధాని మోడీ మాత్రం అదే గ్రూప్‌కు చెందిన నాయకుడైనప్పటికీ మోడీని ముగ్గులోకి దించేసి మోడీ విధేయునిగా ముసుగును కప్పుకున్నాడు. అంత నమ్మకస్తుడైన వాడిగా, సమర్దునిగా పేరు తెచ్చుకోవడంతోనే తాజా మంత్రి వర్గ విస్తరణలో ప్రదాని మోడీ అత్యంత సున్నితమైన, క్లిష్టమైన సమాచార, ప్రసార శాఖా మంత్రి వర్గాన్ని అరుణ్‌జైట్లీ నుండి తొలగించి వెంకయ్యకు అప్పగించాడు. వాస్తవానికి ఈ రెండేళ్ల కాలంలో మోడీ ప్రభుత్వం చేపడుతున్న ప్రజాసంక్షేమ పథకాలు, తీసుకుంటున్న చర్యలను సరిగ్గా ప్రమోట్ చేయలేకపోయాడు అరుణ్‌జైట్లీ. దీంతో కాంగ్రెస్ అనుకూల మీడియా మోడీ సర్కార్‌పై విమర్శలతో మోడీని ఇరుకున పెడుతోంది. పేరుకు అరుణ్‌జైట్లీకి ఆనారోగ్య కారణాల వల్ల ఆయన వద్ద ఉన్న సమాచారప్రసార శాఖను వెంకయ్యకు అప్పగించారని చెబుతున్నప్పటికీ కేవలం ఇది ఓ వంక మాత్రమే అని అర్ధమవుతోంది. వెంకయ్య తిమ్మిని బమ్మిని చేయడంలో, మాటల చతురతతో విపక్షాలపై మాటల తూటాలను సంధించడంలో దిట్ట అనే పేరుంది. అయితే ఇంతకాలం ఆయనకు ఈ బాధ్యత ఇవ్వకపోవడానికి కారణం వెంకయ్య స్వతహాగా హిందీ, ఇంగ్లీషు భాషల్లో అనర్గళంగా మాట్లాడుతాడా? లేక దక్షిణాది వాడిగా తెలుగులో మాట్లాడినట్లుగా ఇతర భాషల్లో ఆయనకు అంతటి సామర్ధ్యం ఉందా? హిందీ, ఇంగ్లీషు మీడియాను ఆయన ఆకట్టుకోగలడా? లేదా? అనే సంశయం మాత్రమే కానీ గత కొంతకాలంగా వెంకయ్య హిందీ, ఇంగ్లీషుల్లో కూడా అనర్గళంగా మాట్లాడేస్తున్నాడు. అదే ఆయనకు ఇప్పుడు వరంగా మారింది...!