వాస్తవానికి కేంద్రమంత్రి వర్గ విస్తరణలో టిడిపికి మూడో మంత్రి పదవి వస్తుందని అందరూ ఆశించారు. కానీ మోడీ టిడిపికి మరో మంత్రి పదవి ఇవ్వలేదు. వాస్తవానికి మోడీ మూడో మంత్రి పదవి రాకపోవడం వెనుక మూడు కారణాలు ఉన్నాయని అంటున్నారు. దీనిలో ఎవరికి నచ్చిన వాదనను వారు విశ్లేషిస్తున్నారు. మూడో మంత్రి పదవిని చంద్రబాబు స్వయంగా తిరస్కరించాడని, కేవలం విభజన చట్టాలను అమలు చేయడం, ఆర్దిక ప్యాకేజీలు, రాజధానికి నిధులు, ప్రత్యేక హోదా, ప్రత్యేక రైల్వే జోన్.. వంటి హామీలను అమలు చేస్తే తమకు అదే చాలని బాబు భావించాడు అంటున్నారు. కేంద్రం నుండి ఏపీకి రావాల్సిన వాటిని సాధించకుండా కేవలం మూడో మంత్రి పదవితో సరిపెడితే రాష్ట్ర ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని బాబు భావించాడంటున్నారు. అంతేగాక మూడో మంత్రి పదవి కోసం ఏపీలో కులాల రగడ జరుగుతోంది. తమ వర్గానికే ఇవ్వాలంటే తమ వర్గానికే ఇవ్వాలనే పోటీ ఎక్కువ కావడం వల్ల కూడా ఎవరికి ఇచ్చినా ఇబ్బందులు వస్తాయని బాబు భావించాడని సమాచారం. మరో వాదన ఎలా ఉందంటే మోడీనే కావాలని టిడిపికి మూడో మంత్రి పదవి ఇవ్వలేదని, ఏపీలో సొంతగా ఎదగాలని భావిస్తున్న బిజెపి.. టిడిపిని ధీటుగా ఎదుర్కోవాలంటే ఆ పార్టీకి మరీ ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వకుండా ఉండటమే మేలని అమిత్‌షా సూచించినట్లు చెబుతున్నారు.