సౌతిండియన్ సూపర్‌స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం 'కబాలి'పై ఎన్నో అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. ప్రీరిలీజ్ బిజినెస్‌లో కూడా సంచలనాలు నమోదు చేస్తున్న ఈ చిత్రం రిలీజ్ డేట్ విషయంలో మాత్రం గందరగోళం కొనసాగుతోంది. ఈ చిత్రాన్ని కలైపులిథాను నిర్మిస్తుండగా, రంజిత్‌పా దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రాన్ని మొదట జులై15న విడుదలచేస్తారని భావించారు. కానీ ఈ చిత్రం విడుదల జులై 22కి వాయిదాపడింది. ఆ తేదీన కూడా ఈ సినిమా రిలీజ్ కావడం కష్టమేనని, జులై 29న గానీ లేదా ఆగష్టు మొదటి వారానికి గానీ పోస్ట్‌పోన్ చేస్తారంటూ వార్తలు వస్తున్నాయి. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని ఎట్టి పరిస్ధితుల్లోనూ జులై 22నే విడుదల చేయనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం ప్రీమియర్ షో టిక్కెట్లను మలేషియాలో అమ్మకాలు ప్రారంభించినట్లు విశ్వసనీయ సమాచారం. సో.. ఈ చిత్రం ఈనెల 22న విడుదల పక్కా అని తెలుస్తోంది. సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసిన వెంటనే రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తూ పోస్టర్లను రిలీజ్ చేయనున్నారు. మరో విశేషం ఏమిటంటే.. రజనీ గత చిత్రాలైన 'కొచ్చాడయాన్, లింగ' చిత్రాలు మూడు గంటల నిడివితో రూపొంది డిజాస్టర్స్‌గా నిలిచాయి. దాంతో ఈ చిత్రాలపై పలు విమర్శలు వచ్చాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని 'కబాలి' విషయంలో దర్శకనిర్మాతలు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చిత్రాన్ని 2గంటల 32 నిమిషాలకు ట్రిమ్ చేసినట్లు తెలుస్తోంది. పలు భారీ చిత్రాలకు రన్‌టైం విషయంలో ఏర్పడుతున్న ఇబ్బందుల దృష్ట్యా ముందు జాగ్రత్తగా 152 నిమిషాల నిడివికి పరిమితం చేశారని సమాచారం.