ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఒక సీటును చంద్రబాబు తమ మిత్రపక్షమైన బిజెపికి ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో కేంద్రంలోని మంత్రివర్గ విస్తరణలో టిడిపికి మరో మంత్రి పదవి దక్కవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. మూడో మంత్రి పదవి నిమ్మల కిష్టప్ప, జెసి దివాకర్‌రెడ్డిలలో ఒకరికి దక్కుతుందనే ప్రచారం కూడా జరిగింది. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే టిడిపికి మూడో మంత్రి పదవి దక్కకపోవచ్చని సమాచారం. టిడిపికి మూడో మంత్రి పదవి ఇస్తున్నారటగా! అని కొందరు రాష్ట్ర బిజెపి నాయకులు బిజెపి జాతీయ అధ్యక్షడు అమిత్‌షాను అడగగా, మీకు చెప్పకుండా ఎలా ఇస్తాం? అని సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో రాష్ట్ర బిజెపి నాయకులు టిడిపికి మూడో మంత్రి పదవి రాదని, దాని బదులు ప్రత్యేక ప్యాకేజీని ప్రకటిస్తారని అంటున్నారు. కానీ టిడిపి నాయకులు మాత్రం మంత్రి పదవిపై నిర్ణయం తీసుకోవాల్సింది మోడీనే అని, ఆయనకు సంబంధం లేకుండా ఏ పని జరగదని, అయితే మోడీ ముందుగానే మూడో మంత్రి పదవిపై మాట్లాడటం లేదని, ఏదిఏమైనా మోడీ.. చంద్రబాబుకే నేరుగా ఫోన్ చేసి నిర్ణయిస్తారని అంటున్నారు.