యంగ్ టైగర్ ఎన్టీఆర్‌లో మంచిమార్పు వచ్చింది. ఎంత బిజీగా ఉన్నాసరే తనను చూడటానికి వచ్చిన అభిమానులతో ఓపిగ్గా మాట్లాడుతూ.. నవ్వుతూ ఫొటోలకు ఫోజులిస్తున్నాడు. దీంతో ఆయన అభిమానుల ఆనందానికి హద్దే లేకుండా పోతోంది. చెన్నైలో జరిగిన షెడ్యూల్ నుండి నిన్నటివరకు సాగిన సాంగ్ వరకు షూటింగ్ స్పాట్‌లో అభిమానులతో కలిసి ఆయన బాగా కలిసిపోతున్నారు. ఆ అభిమానులంతా థాంక్యు తారక్ అనే హ్యాష్‌టాగ్‌తో తాము ఎన్టీఆర్‌తో దిగిన ఫొటోలను షేర్ చేస్తున్నారు. థాంక్యు తారక్ అనేది గురువారం నుండి ట్రెండింగ్ సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో మొదలైంది. ఇప్పటివరకు దాదాపు 10వేలకు పైగా ఫొటోలను అభిమానులు షేర్ చేశారు. 'జనతాగ్యారేజ్' తొలి రోజు షాట్ నుండి నిన్నటి సాంగ్ వరకు ఎన్టీఆర్‌ను కలిసి ఫొటోలు దిగిన అభిమానులు వాటిని షేర్ చేస్తున్నారు. అంతమందితో అన్నిరోజులు మొహంలో చిరునవ్వు చెదరకుండా ఫొటోలకు ఫోజులిచ్చిన ఎన్టీఆర్ ఓపికకు అందరూ అబ్బురపడుతున్నారు. ఇది అందరివల్లా జరిగే పని కాదని అంటున్నారు.