ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'జనతాగ్యారేజ్'. ఈ చిత్రాన్ని ఆగష్టు 12న విడుదల చేస్తామని కొబ్బరికాయ కొట్టే రోజే ప్రకటించారు. అప్పుడే కృష్ణ పుష్కరాలు మొదలవ్వడం, వరుసగా సెలవులు వస్తుండటంతో ఆ డేట్‌న రిలీజ్ చేయాలని ఈ చిత్ర యూనిట్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. కానీ సౌత్‌ఇండియన్ సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్న 'కబాలి' విడుదల వాయిదాల మీద వాయిదాలు పడుతోంది. దీంతో నిర్మాత కలైపులి థాను ఈ చిత్రాన్ని ఆగష్టు 12న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అదే జరిగితే 'జనతాగ్యారేజ్'కు తిప్పలు తప్పవు. 'కబాలి' చిత్రం తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలకానుంది. మరోవైపు 'జనతాగ్యారేజ్'ను కూడా తెలుగుతో పాటు తమిళం, మలయాళం భాషల్లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. దీంతో థియేటర్ల సమస్య ఏర్పడం ఖాయం. ఇక అదేరోజు హృతిక్‌రోషన్ నటిస్తున్న 'మొహంజదారో', అక్షయ్‌కుమార్ నటిస్తున్న 'రుస్తుం' చిత్రాలు విడుదల ఖాయమైంది. ఇక నాగచైతన్య కూడా తన 'ప్రేమమ్' చిత్రాన్ని అదేరోజు విడుదల చేయాలని భావిస్తున్నాడు. పోనీ 'కబాలి' ఒక వారం, రెండు వారాలు ముందుకు వస్తే వెంకీ 'బాబు బంగారం'కు తిప్పలు తప్పేట్లు లేవు.