హీరోలు వేషం మార్చి, లేడీ గెటప్‌లు వేస్తే ఆ మజాయే వేరు. దాని నుండి పుట్టే హాస్యం అందరినీ ఆకట్టుకుంటుంది. కానీ ఒకసారి స్టార్ ఇమేజ్ వచ్చిన తర్వాత మాత్రం అలాంటి వేషాలు వేయడానికి కమర్షియల్‌స్టార్స్ ఒప్పుకోకపోయినా అభిరుచిగల హీరోలు మాత్రం స్టోరీ డిమాండ్ చేస్తే అలాంటి గెటప్‌లు వేయడానికి వెనుకాడరు. అప్పుడెప్పుడో జంధ్యాల దర్శకత్వంలో చిరంజీవి, సుహాసినిలు కలిసి నటించిన 'చంటబ్బాయ్' చిత్రంలోని ఓ పాటలో కొద్దిసేపు చిరంజీవి లేడీ గెటప్‌తో కనిపిస్తాడు. ఆ తర్వాత సీనియర్ నరేష్ 'చిత్రం భళారే విచిత్రం' చిత్రంలో లేడీ గెటప్ వేసి అదరగొట్టాడు. ఇక రాజేంద్రప్రసాద్ సైతం 'మేడమ్' చిత్రంలో లేడీ గెటప్‌తో నవ్వులు పూయించాడు. కమల్‌హాసన్ అయితే 'భామనే సత్యభామనే' చిత్రంతో పాటు 'దశావతారం' చిత్రంలో కూడా లేడీ గెటప్ వేసి వావ్.. అనిపించాడు. 'మల్లన్న' చిత్రంలో హీరో విక్రమ్ కూడా అలాగే నటించి మెప్పించాడు. తాజాగా తమిళంలో స్టార్‌గా ఎదుగుతున్న వైవిధ్యమైన హీరో శివకార్తికేయన్ తన తాజా చిత్రం 'రెమో'లో లేడీ నర్స్ పాత్రలో కనిపించనున్నాడు. అతడి సరసన 'నేను..శైలజా' ఫేమ్ కీర్తి సురేష్ నటిస్తోంది.ఈ చిత్రం ఫస్ట్‌లుక్ ఇప్పుడు అందరినీ బాగా ఆకట్టుకుంటోంది. ఇందులో శివకార్తికేయన్ లేడీ గెటప్ చూసినవారికి ఆడవాళ్లకే అసూయ పుట్టించే రేంజ్‌లో శివకార్తికేయన్ కనిపిస్తుండటం విశేషం.