ఆర్‌బిఐ గవర్నర్ రఘురామరాజన్ మానసికంగా భారతీయుడు కాదని వ్యాఖ్యానించిన బిజెపి ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి వ్యాఖ్యలపై ఓ ఇంటర్వ్యూలో స్వయంగా ప్రధాని మోడీ స్పందించారు. యుపిఎ ప్రభుత్వం నియమించిన రాజన్‌ను బిజెపి తొలగిస్తోందని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఆయన పూర్తి కాలం పదవిలో కొనసాగుతారని మోడీ స్పష్టం చేశాడు. రఘురామరాజన్‌తో పాటు కేంద్ర ఆర్ధిక సలహాదారు అరవింద్ సుబ్రహ్మణ్యం, ఆర్దిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత్ దాస్‌లు లక్ష్యంగా స్వామి ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆర్దికమంత్రి అరుణ్‌జైట్లీ పైన కూడా ఆయన పరోక్ష విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలు బిజెపికే కాదు.. యావత్ దేశానికి నష్టం చేకూర్చే విధంగా మారడంతో స్వయంగా మోడీ స్పందించారు. ఇది మా పార్టీలో జరిగిందా? లేక వేరే పార్టీలో జరిగిందా? అనే విషయాన్ని పక్కనపెడితే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు. పబ్లిసిటీ మోజులో ఇలా చేయడం దేశానికి ఏమాత్రం మంచిచేయదు. ఎవరైనా సరే తాము వ్యవస్థ కంటే గొప్పవారిమనుకుంటే తప్పు అని మోడీ వ్యాఖ్యానించాడు. రఘురామ రాజన్ దేశభక్తిని తాను శంకించనని, అందరికంటే ఆయనకు దేశభక్తి ఎక్కువ అని మోడీ అన్నారు. రాజన్‌ను తాను అతి దగ్గర నుండి చూశానని, ఆయన ఏ పదవిలో ఉన్నా, ఏస్దానంలో ఉన్నా దేశంకోసం పనిచేశారని మోడీ... రఘురామరాజన్‌ను మెచ్చుకున్నారు. మోడీ వ్యాఖ్యలతో సుబ్రహ్మణ్యస్వామికి షాక్ తగిలినట్లైందని చెప్పవచ్చు.