అల్లు శిరీష్ హీరోగా నిలదొక్కుకోవాల్సిన కీలక సమయంలో వస్తున్న అతని కొత్త చిత్రం శ్రీరస్తు శుభమస్తు. చక్కటి ప్రతిభ గల దర్శకుడు పరశురామ్ నుండి చాన్నాళ్ల తరువాత సిద్దమవుతున్న ఈ చిత్రం మీద అసలు ఎంత మాత్రం అంచనాలు లేకపోవడమే ఇక్కడ పెద్ద ప్లస్ అని చెప్పుకోవాలి. అందుకే ఈరోజు నిర్మాత అల్లు అరవింద్ అండ్ గీతా ఆర్ట్స్ వారు విడుదల చేసిన టీజర్లో కూడా పెద్ద అంచనాలను పెంచే ప్రయత్నం జరిగినట్టు అనిపించలేదు.
శ్రీరస్తు శుభమస్తు ఓ సింపుల్, యూత్ ఫుల్, లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అన్న భావన కలిగిలేలా ఈ టీజర్ జాగ్రత్తగా రూపొందించినట్టున్నారు. కశ్మీర్ లాంటి అందమైన లొకేషన్ నుండి మొదలయిన ఈ అరనిమిషం టీజర్, లైఫులో ఎవరినీ ఎక్కువగా ప్రేమించకూడదు... ఏదో బ్యాగేజ్ మోస్తున్న ఫీలింగ్... మన క్యారెక్టరును మనకు తెలీకుండానే చంపేసుకుంటుంటాము... లాంటి అర్థవంతమైన సంభాషణలతో హీరో పాత్ర చిత్రణ సాగింది. మధ్యలో శిరీష్, లావణ్య త్రిపాఠిల రొమాన్స్... సుమలత, ప్రకాష్ రాజ్ లాంటి పాత్రలతో కాసింత బరువెక్కించాడు పరశురాం. ఇక చివరలో చిలిపిగా నీ ఫిజిక్ అంటే నాకిష్టం అని లావణ్యను ఉద్దేశించి శిరీష్ ఉఛ్చరించిన తీరు కూడా పర్వాలేదు అనిపించింది. గుర్తించాల్సిన విషయం ఏమిటంటే శిరీష్ నటనలో కొంతలో కొంత పరిణతి కనిపించింది. అర నిమిషం చూసి ఆత్రంగా సినిమా రిజల్ట్ చెప్పేయలేం కదా... ఇప్పటి వరకైతే టీజర్ శ్రీరస్తు... అలాగే మొత్త్తం సినిమా కూడా బాగుంటే అందరికీ శుభమస్తు.