ఎవరినైనా టార్గెట్ చేసుకున్నాడంటే బిజెపి నేత సుబ్రహ్మణ్య స్వామి ఉడుం పట్టు పడతాడు. న్యాయ పోరాటంలో కాకలు తీరిన స్వామి ప్రస్తుతం చంద్రబాబును, ఆయన ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకున్నాడు. ఆయన చూపు ఇప్పుడు బాబుపై పడింది. తిరుమల ఆలయ నిర్వహణపై సుబ్రహ్మణ్యస్వామి కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ఏ ఏ ఆలయమైనా సరే మూడేళ్లకు పైగా ప్రభుత్వ ఆధీనంలో ఉండకూడదని ఆయన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తిరుమల 1933 నుంచి ప్రభుత్వ ఆధీనంలో ఉందని చెబుతూ సుప్రీం కోర్టు ఆదేశాలను ఆయన ఉటంకించారు. టిటిడి భూములపై టిడిపి ప్రభుత్వం ఆధిపత్యం చేస్తోందని, ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని, దానిపై తాను సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని ఆయన పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలతో టిడిపి ప్రభుత్వంలోని నేతలకు గుబులు మొదలైంది. ఆ వ్యాఖ్యల వెనుక ఎవరున్నారనే దానిపై టిడిపి నాయకులు ఆరా తీశారని సమాచారం. విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద్రేంద్ర స్వామి ఇటీవల సుబ్రహ్మణ్యస్వామిని కలిశాడు. ఆయన ప్రోద్బలంతోనే స్వామి చంద్రబాబు ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నాడని అర్ధమవుతోంది. గత కొంతకాలంగా స్వరూపానంద్రేంద్ర స్వామి హిందువుల తరపున వకాల్తా పుచ్చుకున్నట్లుగా చంద్రబాబును టార్గెట్ చేస్తున్నాడు. ఆయన జగన్ చేతిలో అస్త్రంగా మారారని చంద్రబాబు సైతం ఆరోపిస్తున్నాడు. దాంతో ఇప్పుడు అందరి చూపు సుబ్రహ్మణ్యస్వామిపై పడింది.