ఇండస్ట్రీలో ఎందరో గురుశిష్యులు ఉన్నారు. గురువును మించిన శిష్యులు కూడా ఉన్నారు. ఈ విధంగా చూసుకుంటే దాసరి శిష్యులైన ముత్యాలసుబ్బయ్య, మోహన్‌బాబు, కోడిరామకృష్ణ వంటి వారు తమ చిత్రాలలో నటించమని దాసరికి ఎన్నోసార్లు అవకాశాలు ఇచ్చారు. ఇక తమిళంలో చూసుకుంటే రజనీకాంత్, కమల్‌హాసన్‌లు తమ గురువైన బాలచందర్ వంటి వారికి తమ చిత్రాలలో పాత్రలు ఇచ్చారు. కె.విశ్వనాథ్ కూడా తన శిష్యుల చిత్రాల్లో కొన్ని పాత్రలు చేశాడు. నేటితరం విషయానికి వస్తే త్రివిక్రమ్‌శ్రీనివాస్‌కు పోసాని కృష్ణమురళి గురువు. పోసాని వద్ద చాలాకాలం త్రివిక్రమ్ రచనా విభాగంలో పనిచేశాడు. ఇక త్రివిక్రమ్ దర్శకునిగా మారిన తర్వాత దాదాపు ఒకటి రెండు చిత్రాల్లో మినహా మిగిలిన అన్నింటిలో పోసానికి మంచి మంచి పాత్రలు ఇస్తున్నాడు. ఇక తమిళంలో దర్శకుడు, నటుడు ఎస్.జె.సూర్యకు సెన్సేషనల్ డైరెక్టర్ మురగదాస్ శిష్యుడు. మురగదాస్.. ఎస్.జె.సూర్య వద్ద దర్శకత్వ విభాగంలో చిత్రాలు చేశాడు. ఇక మురుగదాస్‌ను అజిత్‌కు పరిచయం చేసి ఆయనకు మొదటి అవకాశం ఇప్పించింది కూడా ఎస్.జె.సూర్యనే కావడం గమనార్హం. ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో మహేష్‌బాబు హీరోగా తెరకెక్కనున్న చిత్రంలో మెయిన్ విలన్ పాత్రను సూర్యకే ఇచ్చి, గురువు రుణం తీర్చుకుంటున్నాడు మురుగదాస్.