ఓ హీరో ఎందుకు క్లిక్ అయ్యాడు అంటే దానికి ఒక్క కారణం చాలు. కానీ ఎంత బ్యాక్ గ్రౌండ్ ఉన్నా ఓ హీరో ఎందుకు ముందుకు ఎగరలేకపోతున్నాడు అంటే సవా లక్ష కారణాలు దొరుకుతాయి. పాపం నారా రోహిత్ సంగతి రెండో కోవలోకే చేరిపోయింది. కెరీర్ మొదలు పెట్టి ఏడేళ్లు కావస్తున్నా సరైన హిట్టు పడక సతమతం అవుతున్నాడు. గత ఏడాది కాలంలో వరసపెట్టి తుంటరి, సావిత్రి, రాజా చెయ్యి వేస్తే లాంటి వరస చిత్రాలు విడుదల చేసినా కనీస ఫలితాలు కూడా సాధించని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు.
ఈ మధ్యలో కథలో రాజకుమారి అని న్యూ మూవీ ఒకటి షూటింగ్ ఫైనల్ దశకు చేరుకుంది. మహేష్ సూరపనేని దర్శకత్వంలో నమిత ప్రమోద్ హీరోయినుగా వస్తున్న ఈ సినిమాకు సంబంధించిన కొత్త ప్రచార చిత్రాలను నిర్మాతలు ఈరోజే బయటికి వదిలారు.
రోహిత్ విషయంలో మొదటి నుండి అటు జనాలు, ఇటు క్రిటిక్స్ పెదవి విరుస్తున్నది అతడి బరువైన ఆకారం మీదే. హీరో అంటే ఇలా స్లిమ్ముగా ఉండాలి అన్న రూల్ లేకపోయినా, చూడటానికి మాత్రం ఎబ్బెట్టుగా ఉండకూడదు. రోహిత్ డ్యాన్సులు, పోరాటాలు గట్రా చేస్తుంటే అతడి శరీర సౌష్టవమే అన్నింటినీ డామినేట్ చేసి ప్రేక్షకులకు మరేది గుర్తుకు రాకుండా చేస్తోంది. విషయాన్ని గ్రహించిన రోహిత్ కూడా తన తదుపరి సినిమాలలో బరువు తగ్గించి నాజూగ్గా కనపడతానని మాటిచ్చాడు. మరి ఈ రోజు విడుదలయిన కథలో రాజకుమారి పోస్టర్లలో ఉన్న రోహిత్ ఆకారంలో ఎటువంటి మార్పు కనిపించలేదు. ఇక ఇప్పుడు కూడా మారకపోతే ఇంకెప్పుడు మారినా లాభం ఉండకపోవచ్చూ.