అల్లు అర్జున్ హీరోగా సినిమా అంటే ముందులాగా లేదు మ్యాటర్. సరైనోడు క్లయిమాక్స్ కోసం బోయపాటి లాంటి దర్శకుడినే టేబుల్ మీద కూర్చోపెట్టి పని చేయించిన ఘనత గీతా ఆర్ట్స్ సంస్థది. అంతే కాక వీరి సంస్థ చుట్టూ లింగుసామి లాంటి బడా దర్శకుడిని ప్రదక్షిణలు చేయించి చివరకు కథ నచ్చక, డేట్లు ఇవ్వకుండా పొమ్మన్నారు. మరి అలాంటిది హరీష్ శంకర్ అనగానే అంత తేలిగ్గా, నిర్మాత దిల్ రాజుకు ఎలా ప్రాజెక్టు అప్పజెప్పారు అన్నదే నమ్మలేని పాయింట్. పైగా హరీష్ బాబు బొత్తిగా ఫామ్ లో కూడా లేడాయే. అతగాడు చేసిన రామయ్య వస్తావయ్యా, సుబ్రమణ్యం ఫర్ సేల్ పెద్ద హిట్లు కూడా కావు.
విషయం ఏమిటనగా హరీష్ శంకర్ చాన్నాళ్లుగా క్యాంపులో ఖాళీగా ఉండడంతో దిల్ రాజు రికమండేషన్ మీద మాత్రమే అల్లు అరవింద్, అల్లు అర్జున్ ఓ స్టోరీ లైన్ విన్నారట. పూర్తి స్క్రిప్ట్ తయారయి అందరికీ నచ్చితేనే ముందుకు వెళ్ళేది అని ఖరాఖండీగా ముందే తేల్చి చెప్పారట. అందుకే కాబోలు ఫలానా తారీఖు నుండి షూటింగ్ అని కూడా తేల్చకుండా ఓ ప్రెస్ నోట్ బయటకు వదిలారట. బన్నీ పూర్తి స్థాయి మాస్, స్టార్ హీరోగా ఎదుగుతున్న ఈ రోజుల్లో ఆషామాషీ స్క్రిప్ట్ చేసుకొచ్చి, పదండి సెట్స్ మీదకి అంటే కదిలేది లేదని హెచ్చరించారని కూడా టాక్. అంటే బన్నీకి, వాళ్ళ నాన్నకి నచ్చేదాకా హరీష్ పని చేయాల్సిందే. ఎంతో తెలివిగా రిలీజ్ తారీఖు వచ్చే వేసవికి ఉండొచ్చూ అని చెప్పుకుంటున్నారు సదరు దిల్ రాజు నిర్మాణ సంస్థ వారు.