ఏడాదిన్నర కిందట హీరో నాని అంటే టాలెంట్ ఉన్న ఓ దురదృష్టవంతుడైన హీరో. కానీ ఏడాదిన్నర గడిచే సరికి నాని కాస్తా నేచురల్ స్టార్ అయిపోయాడు. ఆయన నటించిన 'ఎవడే సుబ్రహ్మణ్యం, భలే భలే మగాడివోయ్, కృష్ణగాడి వీర ప్రేమగాధ, జెంటిల్‌మన్' చిత్రాలతో ఆయన వరుసగా నాలుగు విజయాలు సాధించి సినిమా సినిమాకు తన రేంజ్‌ను పెంచుకుంటున్నాడు. మినిమం గ్యారంటీ కలిగిన హీరోగా, కేవలం 10కోట్లతో సినిమా తీస్తే 20కోట్లు వసూలు చేయగలిగిన హీరోగా ఇప్పుడు నాని పేరు మారుమోగుతోంది. ఒకప్పుడు రవితేజ అంటే మినిమం గ్యారంటీ హీరోగా పేరుతెచ్చుకున్నాడు. కానీ ఈమధ్యలో ఆ స్దానాన్ని నాని లాగేసుకున్నాడు. మంచి మంచి వెరైటీ సబ్జెక్ట్‌లను ఎంచుకొంటూ తన రేంజ్‌ను పెంచుకుంటున్నాడు. అయితే ఆయన ప్రస్తుతం 'ఉయ్యాల జంపాల' ఫేమ్ విరించి వర్మ దర్శకత్వంలో ఓ చిత్రం, ఆ తర్వాత దిల్‌రాజు నిర్మాతగా మరో చిత్రానికి ఆయన డేట్స్ ఇచ్చాడు. తన తోటి హీరోలందరినీ మించిపోతున్నాడు. ఇక ఆయన చిత్రాలకు ఓవర్‌సీస్‌లో కూడా మంచి క్రేజ్ ఉండటం ఆయనకు ఉన్న మరో ప్లస్ పాయింట్. వరుసగా నాలుగు చిత్రాలు కూడా ఓవర్‌సీస్‌లో మంచి కలెక్షన్లు రాబట్టి ఆయన్ను మిలియన్ క్లబ్‌లో చేరుస్తున్నాయి. ఇలా ఆయన మీడియం బడ్జెట్ చిత్రాలకు ఆపద్భాంధవుడిగా, వెరైటీ చిత్రాలు తెరకెక్కించాలని భావిస్తున్న దర్శకులకు ఓ ఆప్షన్‌గా, మినిమం లాభాలను సంపాదించే హీరోగా ఎదుగుతున్న నాని కెరీర్ భవిష్యత్తులో మరింత మంచి స్దాయిని చేరడం ఖాయమని సినీ పండితులు అంచనా వేస్తున్నారు.