ఎన్టీవీ నుండి బయటకు వచ్చి సాక్షి చానెల్‌లో చేరిన సీనియర్ పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాసరావు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్రంగా విరుచుకుపడుతున్నాడు. ఇప్పటివరకు తటస్ధ మీడియా చానెల్ ఎన్టీవీలో ఉన్న ఆయన సాక్షిలో చేరిన వెంటనే తన విమర్శలకు పదునుపెట్టడం పలు అనుమానాలకు తావిస్తోంది. తనను కేవలం చంద్రబాబు, లోకేష్‌లు బలవంతంగా ఎన్టీవీ నుండి తప్పించడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆయన చెబుతున్నారు. కిందటి ఎన్నికల్లో ఎన్టీవీ - నీల్సన్ సర్వే ఫలితాలు టిడిపికి వ్యతిరేకంగా రావడం, దానికి తాను ప్రజెంటర్‌గా ఉండటం వల్లే తానంటే చంద్రబాబుకు కోపం తెప్పించిందని ఆయన చెబుతున్నమాటల్లో అస్పష్టత కనిపిస్తోంది. మరోవైపు సీఎంగా పదవి చేపట్టిన వెంటనే సీనియర్ జర్నలిస్ట్‌లకు బాబు లంచ్ ఏర్పాటు చేశారని, తాను కూడా ఆ కార్యక్రమానికి హాజరుకాగా సీఎం తనను ఉద్దేశించి ఇకనైనా మారరా? అని తనను ప్రశ్నించాడని కొమ్మినేని చెబుతున్నాడు. తాను, తన చానెల్ చేసిన తప్పు ఏమిటి? అని తాను అప్పుడే చంద్రబాబును నిలదీయడంతో ఆయనకు మరింత కోపం వచ్చిందని, అందువల్లే ఆయన తనపై ద్వేషం పెంచుకున్నారని కొమ్మినేని సెలవిస్తున్నాడు. ఇక సాక్షిలోకి వచ్చాడు కాబట్టి రాజశేఖర్‌రెడ్డిని గాల్లోకి ఎత్తేశాడు. తాను వైఎస్, బాబుల మధ్య గమనించిన వ్యత్యాసం ఏమిటంటే... వైఎస్‌కు వయసు పెరిగే కొద్ది మెచ్యూరిటీ వచ్చిందని, కానీ బాబుకు మాత్రం వయసు పెరిగే కొద్ది అసహనం పెరిగిపోతోందని ఆయన ద్వజమెత్తారు. తాను ఆంద్రజ్యోతిలో పనిచేసే సమయంలో ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్‌కు వ్యతిరేకంగా ఎన్నో కథనాలు రాశానని, కానీ వైఎస్ ఏనాడు ఇలా కక్ష్యసాధింపు చర్యలకు పాల్పడలేదని ఆయన చెబుతున్నాడు. ఆ రెండు పత్రికలు అంటూ వైఎస్ మీడియా ఎదుటే తన అసహనం వ్యక్తం చేసిన సంగతి సామాన్యులకు కూడా తెలుసు. కానీ కొమ్మినేని మాత్రం అది వాస్తవం కాదని చెప్పడం చూస్తూంటే ఆయన జర్నలిస్టా? లేక రాజకీయ నాయకుడా? అనే అనుమానం వస్తోంది.