సౌతిండియా దిగ్గజ దర్శకులలో శంకర్ ముందు వరుసలో ఉంటాడు. దక్షిణాది చిత్రాలకు తనదైన సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిచయం చేసి ఎప్పుడో దేశ వ్యాప్తంగా ఆయన గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఆయన రజనీ హీరోగా వచ్చిన సంచలన చిత్రం 'రోబో'కు సీక్వెల్‌ను రూపొందించే పనిలో బిజీగా ఉన్నాడు. 'రోబో2.0' గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రజనీకాంత్ హీరోగా, అమీజాక్సన్ హీరోయిన్‌గా నటిస్తుండగా బాలీవుడ్ స్టార్ అక్షయ్‌కుమార్ విలన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈచిత్రం తర్వాత తాను 'భారతీయుడు, బాయ్స్' చిత్రాలకు సీక్వెల్స్‌ను రూపొందిస్తానని ఆయన మాట ఇచ్చాడు. తాజాగా మరో భారీ మల్టీస్టారర్ చిత్రానికి శంకర్ సమాయత్తం అవుతున్నాడని సమాచారం. తమిళ స్టార్స్ విజయ్, విక్రమ్‌ల కలయికలో ఈ చిత్రం రూపొందనుందని తెలుస్తోంది. తమిళనాట విజయ్‌కు ఉన్న ఫాలోయింగ్ అందరికీ తెలిసిందే. శంకర్ ఇప్పటికే తమిళంలో బాలీవుడ్ రీమేక్ '3ఇడియట్స్'ను విజయ్ హీరోగా తెరకెక్కించాడు. ఇక విక్రమ్‌తో 'అపరిచితుడు, ఐ' చిత్రాలను రూపొందించాడు. తమిళ స్టార్ విజయ్, ఆలిండియాలో వెరైటీని కోరుకునే హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విక్రమ్... ఇద్దరూ ఒకే చిత్రంలో అంటే భారీమల్టీస్టారర్ చిత్రంలో... అందునా శంకర్ దర్శకత్వంలో నటిస్తున్నారంటే ఈ చిత్రంపై ఎలాంటి భారీ అంచనాలు ఉంటాయో అందరికీ తెలిసిందే.