అభిమానానికి హద్దులుండవు అని ఊరికే అనడానికి లేదు. ఓ హీరోనో, ఇద్దరు హీరోలనో కాదు, ఏకంగా ఓ ఫ్యామిలీ మొత్తాన్ని నెత్తిన పెట్టుకుని ఊరేగిస్తున్న ఘనత మెగా అభిమానులకే దక్కుతుంది. చిరంజీవి నుండి సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, అల్లు శిరీష్ వరకే కాదు ఇప్పుడు అదే కుటుంబం నుండి హీరోయినుగా ఎంట్రీ ఇఛ్చిన నాగబాబు కూతురు నిహారికను కూడా వారు ఆదరిస్తున్నారు. నాగ శౌర్య, నిహారిక జంటగా నిన్నే విడుదలైన ఒక మనసు చిత్రానికి అంతటా మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. ఈ సినిమాని విశ్లేషకులు భిన్న తరహాలో నిట్టనిలువునా కోసేసి ఫలితాన్ని మార్చే ప్రయత్నం చేసినా ఈ రోజు కూడా వసూళ్లు బాగున్నాయంటే అది మెగా ఫ్యాన్స్ మహిమే. సినిమా కథ, కథనం నెమ్మదిగానో, కళాత్మకంగానో ఎలాగున్నా సరే మెగా అభిమానులు ఆనందించారు.
బట్ వారికి అసలు మింగుడు పడని అంశం నిహారిక ముద్దులు. ఒక మనసు చిత్రం ప్రాణం మొత్త్తం నిహారిక, శౌర్యల మధ్య జరిగే సున్నితమైన రొమాన్స్ మీదే ఆధారపడి ఉంది. అందుకు తగ్గట్టుగానే అనుకుంటే ఎంత కాదన్నా దర్శకుడు రామరాజు కృషి మేర నిహారిక కనిష్టంగా నాగశౌర్యను ఓ యాభై సార్లైనా ముద్దాడి ఉంటుంది. ఇవేవో మీరనుకునే లిప్ కిస్సులు కావులెండి. నుదిటి మీదో, చాతి మీదో, బుగ్గ మీదో, చేతి వేళ్ళ మీదో... అలా రకరకాల చోట్లలో ముద్దుల వర్షంలో హీరోని తడిపేసింది అమ్మాయి. ఇలాంటి ముద్దులు హీరోయిన్ సంధ్య పాత్ర యొక్క ఔచిత్యాన్ని తెలిపేందుకే వాడామని రామరాజు అనుకుంటే సరిపోదు ఎందుకంటే ఇక్కడ ఫ్యాన్స్ మనోభావాలు హర్ట్ అయ్యాయి మరి. చిరంజీవి గారి ఇంటి నుండి వఛ్చిన నిహారికతో ఇంతలా శృంగారాన్ని పండించడం తప్పు కాదా అబ్బాయి. అయినా నువ్వెంటి అమ్మాయ్ అంతలా పాత్రలో జీవించేయాలా?