ప్రతిపక్ష వైసీపీ ఎమ్మెల్యేలు అధికార టిడిపిలోకి క్యూ కడుతూ ఉండేసరికి వైసిపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డితో సహా ఆయన అనుచరులు పార్టీ మారిన వారు దమ్ముంటే తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేయాలని డిమాండ్ చేస్తూనే వస్తున్నారు. కానీ వైసీపీ నుండి టిడిపిలోకి వలస వచ్చిన భూమానాగిరెడ్డి ఆ సవాల్‌ను తాను స్వీకరిస్తున్నానని, అయితే ఎన్నికల్లో తాను గెలిస్తే వైసీపీ పార్టీని మూసివేస్తారా? అని సవాల్ చేసిన సంగతి తెలిసిందే. విచిత్రంగా ఆ రోజు నుండి వైసీపీ నాయకులు ఎవ్వరు మరలా పార్టీ మారిన ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేయాలనే డిమాండ్‌ను లేవనెత్తడం లేదు. కాగా కర్నూల్ జిల్లాలోని కర్నూల్, నంద్యాల, ఆళ్లగడ్డ నియోజకవర్గాల్లో భూమా కుటుంబం వైసీపీ నుండి బయటకు వచ్చిన తర్వాత అక్కడ జగన్‌కు సరైన అభ్యర్ధులు దొరకడం గగనమైపోయింది. భూమానాగిరెడ్డి, అఖిలప్రియ, ఎస్వీమోహన్‌రెడ్డిలను కాదని, అక్కడ ఎవ్వరూ వైసీపీలో చేరడానికి బలమైన అభ్యర్దులు ఆ పార్టీకి దొరకడం లేదు. వాస్తవానికి రాయలసీమలో పార్టీల కన్నా వ్యక్తుల బలాబలాల మీదే గెలుపుఓటములు ఆధారపడి ఉంటాయి. సాంకేతికంగా ఏదో ఒక పార్టీ తరపున పోటీ చేసినప్పటికీ నిలబడిన వ్యక్తుల బలాబలాలపైనే వారి గెలుపోటములు నిర్ణయం జరుగుతుంది. దాంతో వ్యక్తిగతంగా తమ తమ నియోజకవర్గాల్లో బలమైన వ్యక్తులుగా ముద్రపడ్డ భూమా, ఎస్వీ కుటుంబాలకు అక్కడ తిరుగులేదనే చెప్పాలి. కాగా త్వరలో జరగనున్న కర్నూల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తమ సత్తా ఏమిటో చూపి, జగన్‌ను ఉక్కిరిబిక్కిరి చేయాలని భూమా, ఎస్వీలు భావిస్తున్నారు. అందుకోసం ఇప్పటినుండో వ్యూహాలు రచిస్తున్నారు.