దాదాపు గత రెండేళ్లుగా భారతక్రికెట్ జట్టుకు కోచ్ లేకపోయినా డైరెక్టర్ రూపంలో రవిశాస్త్రి జట్టుకు అన్నీ తానై వ్యవహరిస్తున్నాడు. తాజాగా ఆయన భారతజట్టు కోచ్ పదవి కోసం కుంబ్లేతో పాటు పోటీపడ్డాడు. చాలామందైతే రవిశాస్త్రికి చీఫ్ కోచ్ పదవి ఖచ్చితంగా వస్తుందని భావించారు. నిజానికి భారత జట్టులో ఎప్పటినుండో ముంబై ఆటగాళ్ల జోరు కొనసాగుతోంది. రవిశాస్త్రి కూడా ముంబై వాడే కావడం ఆయనకు కలిసొస్తుందని కొందరు భావించారు. కానీ ఆ పదవికి కుంబ్లేను ఎంపిక చేయడంతో రవిశాస్త్రి అసహనంతో ఊగిపోతున్నాడు. గత 18నెలలుగా తాను భారత జట్టుకు సేవలందించి మంచి ఫలితాలు సాధించానని, ఆటగాళ్లను నిశితంగా పరిశీలించిన తనకు ప్రస్తుత ఆటగాళ్ల బలాలు, బలహీనతల గురించి స్పష్టమైన అవగాహన ఉందని, తాను కోచ్‌గా అయివుంటే భారత జట్టుకు ఎంతో మేలు జరిగేదని రవిశాస్త్రి అసహనం వ్యక్తం చేస్తున్నాడు. వాస్తవానికి దశాబ్దాలుగా భారత క్రికెట్ జట్టులో ముంబై వ్యక్తుల ఆధిపత్యం కొనసాగుతోంది. దీనివల్ల దక్షిణాది ఆటగాళ్లకే కాదు... ఉత్తర ప్రాంత ఆటగాళ్లకు కూడా సరైన అవకాశాలు రాని పరిస్థితి నెలకొనిఉంది. కానీ బిసిసిఐ పదవిలోకి జగన్మోహన్ దాల్మియాతో పాటు పలువురు ముంబైయేతర వ్యక్తులు ఎన్నికవుతూ రావడంతో దక్షిణాది ఆటగాళ్లకు, పశ్చిమబెంగాల్‌తో పాటు మరికొన్ని ఇతర ప్రాంతాల ఆటగాళ్లకు మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి. కేవలం ముంబై అని కాకుండా ప్రతిభ ఉన్న ఆటగాళ్లకు అవకాశాలు లభిస్తుండటం పట్ల ప్రస్తుతం అందరూ సంతోషంగా ఉన్నారు. కానీ గవాస్కర్, వెంగ్‌సర్కార్, రవిశాస్త్రి వంటి ఆటగాళ్లు కెప్టెన్లుగా ఉన్నప్పుడు పట్టుబట్టి మరీ సెలక్షన్ కమిటీపై ఒత్తిడి తెచ్చి తమ ప్రాంతపు ఆటగాళ్లకే ప్రాధాన్యం ఇస్తూ వచ్చారు. ముఖ్యంగా రవిశాస్త్రికి ప్రాంతీయ అభిమానం చాలా ఎక్కువ. ఆయన అప్పుడప్పుడు తాత్కాలిక కెప్టెన్‌గా ఉన్నప్పుడు కూడా తమ వారి కోసమే లాబీయింగ్ చేసేవాడనే అపవాదు ఉంది. అలాంటి సమయంలో కుంబ్లే వంటి తటస్దుడు హెడ్‌కోచ్‌గా రావడం శుభపరిణామంగానే చెప్పుకోవాలి.