ఇప్పటి వరకు తను తీసిన చిత్రాల ద్వారా ఫ్యామిలీ ఓరియంటెడ్ సబ్జెక్ట్‌లను బాగా డీల్ చేయగలడనే గుర్తింపును పొందిన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. కుటుంబంలోని బంధాలు, అనుబంధాలు, భావోద్వేగాలు.. వీటన్నింటిని కలిపి ఫీల్‌గుడ్ మూవీస్‌ను డీల్ చేయగలడనే పేరు ఆయనకు వచ్చింది. కానీ ఇటీవల ఆయన చేసిన 'బ్రహ్మోత్సవం' చిత్రం డిజాస్టర్‌గా నిలవడమే కాదు.. ఈ డిజాస్టర్‌కు శ్రీకాంత్ అడ్డాల చేతగాని తనమే కారణమని విమర్శలు వెల్లువెత్తాయి. అదే సమయంలో ఆయన 'బ్రహ్మోత్సవం' తర్వాత ముగ్గురు నలుగురు హీరోలను అప్రోచ్ కాగా వారు కనీసం ఆయన చెప్పే కథలను వినడానికి కూడా ఆసక్తి చూపించలేదని సమాచారం. శ్రీకాంత్ అడ్డాలకు 'కొత్తబంగారులోకం' చిత్రంతో దర్శకునిగా మొదటి అవకాశం ఇచ్చి, ఆ తర్వాత మహేష్, వెంకీల కాంబినేషన్‌లో రూపొంది ఘనవిజయం సాధించిన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రానికి దర్శకత్వం వహించే అరుదైన అవకాశాన్ని శ్రీకాంత్ అడ్డాలకు ఇచ్చిన ఘనత దిల్‌రాజుకే దక్కుతుంది. 'ముకుంద, బ్రహ్మోత్సవం' చిత్రాలు భారీగా దెబ్బతిన్నప్పటికీ ఆయనపై ఉన్న నమ్మకంతో దిల్‌రాజు ఓ మంచి కథను తీసుకొని వస్తే తాను మరలా అవకాశం ఇస్తానని శ్రీకాంత్ అడ్డాలకు మాట ఇచ్చాడని టాలీవుడ్ సమాచారం. మరి ఈ అవకాశాన్నైనా శ్రీకాంత్ అడ్డాల సద్వినియోగం చేసుకుంటాడో లేదో ఎదురుచూడాలి...!