గత కొంతకాలంగా క్రికెట్ ప్రియులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఇండియన్ క్రికెట్ టీమ్ కోచ్ పదవి ఎట్టకేలకు జంబో అనిల్‌కుంబ్లేకు దక్కింది. ఈయన ఎంపికను బిసిసిఐ క్రికెట్ సలహా మండలి సభ్యులైన సౌరవ్‌గంగూలీ, సచిన్, వివిఎస్ లక్ష్మణ్ పూర్తిచేశారు. డంకన్ ఫ్లచర్ పదవి విరమణ తర్వాత దాదాపు రెండేళ్లుగా ఇండియాటీంకు కోచ్‌గా ఎవ్వరు లేరు. డైరెక్టర్‌గా ఎంపికైన రవిశాస్త్రినే అన్నింటిని పర్యవేక్షించారు. ప్రపంచ క్రికెట్‌లో అత్యధిక వికెట్లను తీసిన మూడో బౌలర్ అయిన ఈ గుగ్లీ వీరుడు చాలా సౌమ్యుడు, వివాదరహితుడు. విండీస్‌లో తీవ్రంగా గాయపడి కుట్లు పడినప్పటికీ జట్టుకు తన అవసరం వచ్చిందని భావించి కట్లతోనే బౌలింగ్ చేసిన పోరాటయోధుడు అనిల్‌కుంబ్లే. అయితే విదేశీ కోచ్‌ల మాయలోపడకుండా స్వదేశీ దిగ్గజానికి ఈ పదవి వచ్చేలా చేసిన సౌరవ్‌గంగూలీ, సచిన్, లక్ష్మణ్‌లకు అభినందనలు చెప్పాలి. ముఖ్యంగా ఆయన కోసం పట్టుబట్టిన సౌరవ్, టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్‌కోహ్లీలకు కూడా ఆ క్రెడిట్ దక్కుతుంది. వాస్తవానికి ఇండియాటీమ్ మనకు అచ్చివచ్చే స్వదేశీ పిచ్‌లపై వీరవిహారం చేస్తుంది. కానీ ఫాస్ట్‌బౌలర్లకు స్వర్గధామంగా చెప్పుకునే విదేశీ పిచ్‌లపై చేతులెత్తేస్తుంది. దీంతో భారత జట్టుకు ఇంట్లో పులి.. వీధిలో పిల్లి అనే సామెత సరిగ్గా సూట్ అవుతుంది. ఇక జట్టు ప్రధాన వ్యూహాలను కుంబ్లే చూసుకుంటాడు. అలాగే కుంబ్లే, హర్భజన్‌ల తర్వాత ఇండియా బలమైన స్పిన్ విభాగం బాగా బలహీనపడింది. కేవలం అశ్విన్ మాత్రమే భారత్‌కు దిక్కయ్యాడు. సో.. కుంబ్లే మంచి స్పిన్నర్ కావడంతో ఆయన నేతృత్వంలో జట్టులోకి వస్తోన్న యువ స్పిన్ బౌలర్లకు మంచి మార్గదర్శనానికి వీలవుతుంది. ఇక బ్యాటింగ్ కోచ్‌గా రవిశాస్త్రిని ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కానీ బ్యాటింగ్ కోచ్‌గా రవిశాస్త్రి కంటే రాహుల్ ద్రవిడే మంచి చాయిస్ అని చెప్పవచ్చు. ఇక జహీర్‌ఖాన్ రిటైర్ అయిన తర్వాత జట్టులోకి వచ్చిన పలు యువ ఫాస్ట్‌బౌలర్లకు సరైన దిశానిర్దేశం లేకుండా పోయింది. అలాగే ఆలోటును వెంకటేష్ ప్రసాద్ అయితే తీర్చగలడు. గతంలో కూడా ఆయన బౌలింగ్ కోచ్‌గా జట్టుకు ఎంతో ఉపయోగపడ్డాడు. ఫీల్డింగ్ కోచ్‌లుగా మహ్మద్‌కైఫ్ లేదా రాబిన్‌సింగ్‌లను తీసుకోవడం ఉత్తమం. మొత్తానికి విదేశాల్లో గెలుపులను అందుకునేలా చేయడం ముఖ్యం. ట్వంటీ ట్వంటీలు, వన్డేల విషయం పక్కనపెట్టినా టెస్ట్‌ల్లో మాత్రం విదేశాలపై తమ ప్రతాపం చూపాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పవచ్చు.