కె.రాఘవేంద్రరావు... తెలుగు సినీ చరిత్రలో ఓ వెలుగు వెలిగిన డైరెక్టర్. ఈయన ఎప్పుడూ గడ్డంతో కనిపిస్తూ ఉంటారు. అయితే ఈయన తన సినిమాల్లో రక్తిరసాన్ని ఎంతగా పండించగలరో.. భక్తి రసాన్ని కూడా అదే స్దాయిలో పండించి మెప్పిస్తారు. ఆయన తీసిన భక్తిరస చిత్రాలలో ముఖ్యమైనవి 'అన్నమయ్య, శ్రీరామదాసు, షిర్డీసాయి'. ఈ మూడు చిత్రాలకు రాఘవేంద్రరావు - నాగార్జున - కీరవాణి కలిసి పనిచేశారు. ప్రస్తుతం ఇదే కాంబినేషన్‌లో రూపొందుతున్న మరో భక్తిరస చిత్రం 'ఓం నమో వేంకటేశాయ'. ఈ చిత్రం రేపటి నుండి అంటే జూన్ 25న తేదీ నుండి షూటింగ్ ప్రారంభించుకోనుంది. ఈ సందర్భంగా రాఘవేంద్రరావు తన గడ్డంలేని ఫొటోని ట్వీట్ చేసి, తన గడ్డం వెనుక ఉన్న రహస్యాన్ని తెలియజేశారు. నేను 'జ్యోతి' చిత్రం నుండి ఓ సంప్రదాయం మొదలు పెట్టాను, నా కొత్త సినిమా ప్రారంభమయ్యే సమయంలో గడ్డం తీసేసి, సినిమా పూర్తయ్యే వరకు గడ్డం పెంచుతాను, షూటింగ్ పూర్తి కాగానే మరలా గడ్డం తీసేస్తాను... అంటూ ట్వీట్ చేశాడు. ఆయన శిష్యుడైన రాజమౌళి కూడా ఇదే సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్న సంగతి తెలిసిందే.