మొత్తానికి మాజీ మంత్రి, కాపు నేత ముద్రగడ పద్మనాభం దీక్ష విరమించారు. తుని సంఘటనలో అరెస్టైన 13మందిని విడిపించుకునే దాకా ఆయన దీక్ష కొనసాగించారు. చివరకు అందరూ బెయిల్ మీద విడుదల అయిన తర్వాత ఆయన దీక్ష విరమించారు. అయితే ఇక్కడ ముద్రగడ.. చంద్రబాబుపై పైచేయి సాధించాడని వినిపిస్తున్నప్పటికీ బాబు వ్యూహం బాగానే పనిచేసిందని అంటున్నారు విశ్లేషకులు. ఆయన దీక్ష ప్రారంభించినప్పుడే 13మందికి బెయిల్ వస్తుందని, సో.. ఆయన దీక్ష విరమిస్తారని టిడిపి పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. దీంతో ముద్రగడ దీక్షలో సీరియస్‌నెస్ లేకుండా పోయింది. అయినా ఆయన 13రోజులు దీక్ష ఎలా చేశారు? ఆయన ఫ్లూయిడ్స్ తీసుకుంటున్నారనే వార్తలు కూడా పద్మనాభం దీక్షపై ప్రతికూల ప్రభావం చూపించాయి. ఇక ఆయనకు మద్దతు తెలిపిన చిరంజీవి, దాసరి నారాయణరావులతో పాటు కాంగ్రెస్, వైసీపీ నేతలు ఆయనకు మద్దతు ఇచ్చినప్పటికీ వారు చాలా ఆలస్యంగా స్పందించారని అర్ధమవుతోంది. కేవలం తమ రాజకీయ ప్రయోజనాల కోసమే తప్ప కాపులకు న్యాయం జరగాలని ఆ నాయకులు భావించలేదని కాపులే ఒప్పుకునే పరిస్థితి వచ్చింది. దీనికి తోడు చిరు, దాసరిలు కేంద్రమంత్రులుగా ఉన్నప్పుడు కాపులకు ఏమిచేశారు? అప్పుడు ఎందుకు కాపు సమస్యలపై స్పందించలేదు? అనే వాదనను టిడిపి నాయకులు వినిపించారు. సో... ఈ విషయంలో చంద్రబాబు వ్యూహం ఫలించిందనే వార్తలు వస్తున్నాయి.