ఈ ఏడాది సంక్రాంతికి ఎన్టీఆర్ 'నాన్నకు ప్రేమతో', బాలకృష్ణ 'డిక్టేటర్', నాగార్జున 'సోగ్గాడే చిన్నినాయనా', శర్వానంద్ 'ఎక్స్‌ప్రెస్‌రాజా'లు విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నాలుగు చిత్రాలు మూడు నాలుగురోజుల వ్యవధిలో విడుదల కావడంతో వీటిమధ్యపోటీ వల్ల ఏ చిత్రానికి సరైన కలెక్షన్లు రావని ట్రేడ్ వర్గాలు ఊహించాయి. కానీ దానికి భిన్నంగా ఈ నాలుగు చిత్రాలు మంచి కలెక్షన్లు సాధించాయి. వీటిలో నాగార్జున 'సోగ్గాడే చిన్నినాయనా' బ్లాక్‌బస్టర్‌గా నిలిచి ఎక్కువ లాభాలు సంపాదించింది. ఆ స్ఫూర్తితోనే వచ్చే ఏడాది సంక్రాంతికి కూడా నాలుగు చిత్రాలు పోటీపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. బాలయ్య నటిస్తున్న100వ చిత్రం 'గౌతమీ పుత్ర శాతకర్ణి' సంక్రాంతికి రానుంది. మరోవైపు మెగాస్టార్ 150వ చిత్రం 'కత్తి' రీమేక్ కూడా సంక్రాంతికే విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికీ ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కాకపోయినా రీమేక్ చిత్రం కాబట్టి కంటిన్యూగా షూటింగ్ చేసి సంక్రాంతికి రావడం పెద్ద కష్టమేమీ కాదు. ఇక నాగార్జున-కె.రాఘవేంద్రరావుల కాంబినేషన్‌లో రూపొందనున్న 'ఓం నమో వేంకటేశాయ', పవన్‌కళ్యాణ్ హీరోగా డాలీ దర్శకత్వంలో రూపొందే చిత్రం కూడా సంక్రాంతికే ప్లాన్ చేస్తున్నారు. మరి ఈసారి పోటీలో ఎవరు విజేతగా నిలుస్తారో వేచిచూడాల్సివుంది!