వైయస్సార్‌సీపీలోని ఎమ్మేల్యేలు, ముఖ్య నేతలు టిడిపి చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగా టిడిపిలోకి క్యూ కడుతున్న సంగతి తెలిసిందే. దీంతో రోజురోజుకి వైసీపీ పరిస్దితి తీసికట్టుగా మారుతోంది. వైసీపీకి చెందిన అనుబంధ విభాగాల నేతలు కూడా టిడిపిలో చేరుతుండటం ఇప్పుడు చర్చనీయాంశం అయింది. గుంటూరుజిల్లా పిడుగురాళ్లలో వైసీపీ రాష్ట్ర బిసి సెల్ రాష్ట్ర కార్యదర్శి గురవాచారి టిడిపిలో చేరిపోయాడు. గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు సమక్షంలో ఆయన సైకిలెక్కేశాడు. ఈ సందర్భంగా వైఎస్‌ఆర్‌సీపీ సంస్కృతిపై ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. వైసీపీలో కుల పోరు తారాస్దాయిలో ఉందని, వైసీపీలో బడుగు, బలహీన వర్గాలకు చోటు లేదని ఆయన అంటున్నాడు. అంతేకాదు.. చదువు సరిగా రాని తనకు, ఇంగ్లీషు అసలే రాని తన చేత జగన్ పార్టీ తన పేరుతో కోర్టుల్లో పలు కేసులు వేయించిందని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. మొత్తానికి కులపోరు అన్నిపార్టీల్లో ఉన్నదే అయినా పక్కవారిని బెదిరించడం కోసం, బ్లాక్‌మెయిల్ చేయడం కోసం అమాయకుల పేర్లతో కోర్టుల్లో కేసులు వేసే సంస్కృతిని మాత్రం అందరూ తప్పుపడుతున్నారు.