ఆర్‌బిఐ గవర్నర్‌గా పనిచేస్తున్న రఘురాంరాజన్‌ను కేంద్రంలోని కొందరు అధికార పార్టీ నాయకులు టార్గెట్ చేయడంతో ఇక ఆ పదవిలో తాను రెండోసారి కొనసాగనని రాజన్ తేల్చేసిన సంగతి తెలిసిందే. ప్రపంచంలోనే అత్యంత నైపుణ్యమైన ఆర్దికవేత్తగా రాజన్‌కు మంచి పేరుంది. ఆర్‌బిఐ గవర్నర్‌గా ఆయన తన హయాంలో తీసుకున్న పలు నిర్ణయాలు సత్పలితాలను ఇచ్చాయి. అయినా సరే ఆయన్ను కేంద్రం టార్గెట్ చేయడం, ముఖ్యంగా సుబ్రహ్మణ్యస్వామి వ్యాఖ్యలు, వాటి వెనుక మోడీ ప్రమేయం ఉందనే ఆరోపణల మధ్య మనస్ధాపానికి గురైన రాజన్ ఈ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఆయనకు విపక్షాలు, మాజీ దేశ ప్రధాని, ఆర్దికరంగ నిపుణులు మన్మోహన్‌సింగ్ నుంచే కాక నోబెల్ అవార్డు గ్రహీత అమర్త్యసేన్ నుండి కూడా మద్దతు లభిస్తోంది. అత్యంత గొప్ప ఆర్ధికవేత్త సేవలను కుళ్లు రాజకీయాల వల్ల దేశం కోల్పోయిందనే ఆవేదన,ఆగ్రహం చాలామంది ఆర్దికనిపుణుల మాటల్లో వ్యక్తమవుతోంది. ఇప్పుడు రఘురామ్‌రాజన్ స్దానంలో ఆర్‌బిఐ తదుపరి గవర్నర్‌గా ఎవరు పగ్గాలు చేపడతారనే దానిపై అందరి దృష్టి నిలిచివుంది. ఇందుకోసం ప్రభుత్వం ఇప్పటికే 12మంది పేర్లతో ఒక జాబితా తయారుచేసినట్లు సమాచారం. ఇందులో ఎస్‌బిఐ ఛీఫ్ అరుంధతీ భట్టాచార్య, ఆర్‌బిఐ డిప్యూటీ గవర్నర్ ఉర్దిత్‌పటేల్, మాజీ డిప్యూటీ గవర్నర్ రాకేష్ మోహన్, సెబి చైర్మన్ యుకె సిన్హా, ఐసిఐసిఐ బ్యాంకు మాజీ చీఫ్ కెవి కామత్, ప్రపంచ బ్యాంక్ ప్రధాన ఆర్ధికవేత్త కౌశిక్‌బసు, కాగ్ మాజీ చీఫ్ వినోద్‌రాయ్‌ల పేర్లు వినిపిస్తున్నాయి. ఇందులో మోడీ అరుంధతీ భట్టాచార్యకే ఎక్కువ శాతం మొగ్గుచూపే అవకాశాలు కనిపిస్తున్నాయి.