ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఏపీలో చంద్రబాబు తమ మిత్రపక్షమైన బిజెపికి ఓ సీటు ఇవ్వడం, దాంతో ఇక్కడి నుండి రైల్వేమంత్రి సురేష్‌ప్రభు ఎన్నికైన సంగతి తెలిసిందే. దీనికి ప్రతిఫలంగా త్వరలో కేంద్రమంత్రివర్గ విస్తరణలో మోడీ మరో కేంద్రమంత్రి పదవి టిడిపికి కేటాయించనున్నారని సమాచారం. అయితే ఇప్పటివరకు కేంద్రమంత్రి వర్గంలో ఇద్దరు టీడీపీ ఎంపీలు మంత్రులుగా ఉన్నారు. అశోక్‌గజపతిరాజు, సుజనాచౌదరిలు కేంద్రమంత్రి పదవులు అనుభవిస్తున్నారు. ఈ ఇద్దరు కోస్తాంద్రకు చెందిన వారు కావడంతో త్వరలో తమకు కేటాయించే మూడో కేంద్రమంత్రి పదవిని రాయలసీమకు కేటాయించాలని బాబు భావిస్తున్నాడు. ఏపీలో కోస్తా ప్రాంతంలో కంటే రాయలసీమలోనే టిడిపి కంటే వైసీపీకి కాస్త ఎక్కువబలం ఉంది. అందులోనూ రాయలసీమలో రెడ్డి సామాజిక వర్గానికి మంచి పట్టు ఉండటం కూడా జగన్‌కు కలిసొస్తోంది. అయితే ఈసారి కేంద్రంలో మూడోమంత్రిగా రాయలసీమ రెడ్డి అయిన అనంతపురం ఎంపీ జె.సి.దివాకర్‌రెడ్డికి మంత్రి పదవి ఇవ్వడం ద్వారా సీమలో కూడా తమ పట్టు పెంచుకోవాలని బాబు భావిస్తున్నాడు. మరోవైపు ఈ సారి వచ్చే ఒక్క మంత్రి పదవి బిసిలకు కేటాయించాలనే వాదన వినిపిస్తోంది. ఆవిధంగా చూసుకుంటే హిందుపురం ఎంపీ నిమ్మల కిష్టప్పకు అవకాశం దక్కుతుంది. మొత్తానికి కొత్తగా రాబోయే మంత్రి పదవి రాయలసీమకు అందునా అనంతపురం జిల్లా వారికే వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.