తాను ఎంతో ఇష్టపడి నటించి, దర్శకత్వం కూడా వహించిన చిత్రం విడుదల కాకుండా ఆగిపోతే ఆ బాధ వర్ణనాతీతం. అందులోనూ ఈ చిత్రం మొదటి పార్ట్ సూపర్‌హిట్టు అయి, రెండో భాగం ఆగిపోతే మరెంత బాధగా ఉంటుందో? కమల్ విషయంలో అదే జరిగింది. తానే నటించి దర్శకత్వం వహించిన 'విశ్వరూపం' చిత్రం ఎన్నో వివాదాలు, అడ్డంకుల మధ్య విడుదలై మంచి సక్సెస్ అయింది. దాంతో కమల్ ఎంతో ఉత్సాహంగా ఈ చిత్రం రెండో పార్ట్‌ను తెరకెక్కించాడు.ఈ చిత్రం ఒక పాట, కొన్ని ప్యాచ్ వర్క్‌ల మినహా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకొంది. కానీ ఆర్ధిక కారణాల వల్ల ఈ చిత్రం నాలుగేళ్లుగా విడుదలకు నోచుకోలేకపోతోంది. ఈ చిత్రాన్ని నిర్మించిన ఆస్కార్ ఫిలింస్ అధినేత ఆస్కార్ రవిచంద్ర వద్ద ఈ చిత్రం రైట్స్ ఉన్నాయి. దాంతో ఈ సినిమా విడుదలవుతుందని ఎంతో కాలంగా ఎదురుచూస్తూన్న కమల్ చివరికి విసిగిపోయి లండన్, అమెరికాల్లో ఉన్న తన ఫ్రెండ్స్ సాయంతో ఈ చిత్రాన్ని టేకోవర్ చేసినట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ప్రస్తుతం కమల్‌హాసన్ 'శభాష్‌నాయుడు' చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ పూర్తయిన వెంటనే 'విశ్వరూపం2'లో మిగిలి ఉన్న షూటింగ్ పార్ట్‌ను పూర్తి చేయనున్నాడు. ముందుగా 'శభాష్‌నాయుడు'ను విడుదల చేసి దీపావళి కానుకగా 'విశ్వరూపం2'ను విడుదల చేసేందుకు తానే నడుం బిగించాడు కమల్.