ప్రత్యేక తెలంగాణ పేరుతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి మొదట బిజెపిలో చేరిన విజయశాంతికి అప్పట్లో బిజెపి మంచి విలువనే ఇచ్చింది. కానీ ఆమె ఆ పార్టీ వీడి తప్పుచేసింది. ఇప్పటికీ ఆమె బిజెపిలోనే ఉండివుంటే కేంద్రంలో కీలకస్ధానంలో ఉండేది. ఆ తర్వాత టిఆర్‌ఎస్‌లో చేరి, అక్కడినుండి బయటకు వచ్చి 'తల్లి తెలంగాణ' అనే కొత్త రాజకీయపార్టీని స్దాపించింది. కాని అది పెద్దగా సక్సెస్ అవ్వక మరలా టిఆర్‌ఎస్‌లో చేరి ఆ పార్టీ తరపున ఆమె ఎంపీగా గెలిచింది. అక్కడ ఏమైందో ఏమో టిఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఆమెను పార్టీ నుండి బహిష్కరించడంతో పూర్తిగా మునిపోతున్న కాంగ్రెస్ గూటికి చేరుకుంది. కిందటి ఎన్నికల్లో ఓడిపోవడం, రాను రాను తనను కాంగ్రెస్ అదిష్టానం పట్టించుకోకపోవడంతో ఆమె కొంతకాలంగా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంది. అయితే త్వరలో ఆమె మరలా బిజెపిలో చేరేందుకు పావులు కదుపుతున్నట్లు కనిపిస్తోంది. తెలంగాణలో మంచి నాయకుల కోసం అన్వేషిస్తున్న బిజెపి వారికి విజయశాంతి బెస్ట్ ఆప్షన్‌గా కనిపిస్తోంది. ఇంకోవైపు ఇంతకాలం పెద్దగా బిజెపి పట్టించుకోని ఎమ్మేల్యే నాగం జనార్ధన్‌రెడ్డిని కూడా రాజకీయంగా వాడుకోవాలనే ఆలోచనలో బిజెపి అధిష్టానం ఉన్నట్లు సమాచారం. మొత్తానికి త్వరలోనే రాములమ్మ కమలం గూటికి చేరి వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టాలని భావిస్తోందిట. పనిలో పనిగా మరోసారి సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చి మరలా తన క్రేజ్‌ను పెంచుకొని రాజకీయంగా కీలకంగా ఎదగాలని ఆమె ఆలోచనగా చెబుతున్నారు.