మెగాస్టార్ చిరంజీవి తమిళ 'కత్తి' రీమేక్‌తో తన 150వ సినిమాకు చేరువవుతున్నాడు. నందమూరి బాలకృష్ణ తన 'గౌతమీ పుత్రశాతకర్ణి' చిత్రంతో సెంచరీకి చేరుకోనున్నాడు. ఇక జూనియర్ ఇటీవల వచ్చిన 'నాన్నకు ప్రేమతో' చిత్రంతో 25వ సినిమా పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. విక్టరీ వెంకటేష్ తన కెరీర్‌లో 73వ చిత్రంగా 'బాబు బంగారం' చేస్తున్నాడు. ఈ చిత్రం ఆడియో జులై 9న జరగనుండగా, జులై 29న చిత్రం విడుదలకు సిద్దమవుతోంది. దీని తర్వాత కిషోర్ తిరుమల దర్శకత్వంలో 74వ చిత్రం చేసి, తర్వాత తన 75వ చిత్రంపై ఆయన తన ఫోకస్ పెట్టనున్నాడు. యువహీరో శర్వానంద్ నటిస్తున్న 25వ చిత్రం కూడా త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది. కరుణాకరన్ శిష్యుడు చంద్రమోహన్ దర్శకత్వంలో బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో శర్వానంద్ పోలీస్ పాత్రను చేస్తుండటం విశేషం, ఇక అల్లరి నరేష్ తన 50వ చిత్రంగా 'మామ మంచు.. అల్లుడు కంచు' చిత్రంలో నటించి అర్ధసెంచరీ దాటాడు.ఇక మహేష్ ప్రస్తుతం మురుగదాస్‌తో తన 24వ చిత్రం చేస్తున్నాడు. వీరితో పాటు పవన్, ప్రభాస్ , అల్లుఅర్జున్ వంటి స్టార్స్ కూడా తమ 25వ చిత్రాలకు చేరువవుతున్నారు. మరో ఏడాది, రెండేళ్లలో దాదాపు వీరందరూ ల్యాండ్ మార్క్ చిత్రాలను చేయడం ఖాయంగా కనిపిస్తోంది.