ఎక్కడైనా సరే ముఖ్యమంత్రి తర్వాత సెకండ్ ప్లేస్‌ను హోంశాఖకే కేటాయిస్తారు. మంత్రివర్గంలో సీఎం తర్వాత అన్నీ హోంశాఖ మంత్రికే ప్రాధాన్యం. గతంలో ఎందరో మహామహులు హోంశాఖామంత్రులుగా సీఎంను మించిన స్ధాయిలో ఇమేజ్ సాధించుకున్నారు. కానీ ఏపీ విషయానికి వస్తే మాత్రం హోంశాఖతో పాటు ఉప ముఖ్యమంత్రి పదవిని చినరాజప్పకు కేటాయించాడు చంద్రబాబు. తనకు భవిష్యత్తులో ఆయన వల్ల ఇబ్బందులు రాకూడదనే బాబు ఈ నిర్ణయం తీసుకున్నాడనేది వాస్తవం. ఏమాత్రం పరిపాలనా అనుభవం లేని చినరాజప్ప పరిస్థితి ఇప్పుడు హోంగార్డ్‌కు ఎక్కువ.....హెడ్‌కానిస్టేబుల్‌కు తక్కువ అన్నట్లుగా తయారైంది. ఆ శాఖకు చినరాజప్ప పేరుకు హోంమంత్రే గానీ ఆయనచేతిలో ఏ అధికారాలు లేకుండా అన్ని తానే నిర్ణయాలు తీసుకుంటున్నాడు బాబు. తనతోపాటు డిజిపి రాముడుకు.. చినరాజప్ప తీసుకునే నిర్ణయాలను సమీక్షించే అధికారాన్ని అప్పగించాడనే వార్తలు ఇప్పుడు సంచలం సృష్టిస్తున్నాయి. డీజీపీని ఆదేశించాల్సిన హోంమంత్రి నిర్ణయాలను డిజిపి సమీక్షించడం అంటే అక్కడే అసలు విషయం అర్ధమవుతోంది. ఏపీలో హోంశాఖ పరిస్థితి దీనంగా మారింది. ఎవ్వరూ ఎవ్వరి మాటా వినడం లేదు. ఏ జిల్లా ఎస్పీ కూడా హోంమంత్రి ఆదేశాలను పాటించడం లేదు. దీంతో ఉత్సవ విగ్రహంగా మారిపోయాడు చినరాజప్ప. మరికొందరు మాత్రం చినరాజప్ప విషయంలో మరో అంశాన్ని లేవనెత్తుతున్నారు. చినరాజప్ప పదవిని అడ్డుపెట్టుకొని ఆయన బందువులు పెత్తనం చెలాయిస్తున్నారని దానికి చెక్ పెట్టేందుకే ఆయన అధికారాలకు బాబు కోత పెట్టాడని, మంత్రివర్గ విస్తరణలో కూడా చినరాజప్పకు స్ధానచలనం తప్పదంటున్నారు.